ICRISAT Hyderabad Golden Jubilee : రైతులకు మేలైన విత్తనాలు, నూతన సాగు విధానాలను చేరువచేస్తూ.. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో ఆహార సంక్షోభ నివారణకు ఇతోధిక సేవలందిస్తున్న అంతర్జాతీయ సమశీతోష్ణ మండల పంటల పరిశోధన సంస్థ(ఇక్రిశాట్) స్వర్ణోత్సవ సంబరాలకు సిద్ధమైంది. హైదరాబాద్ నగర శివారు పటాన్‌చెరులో 3,434 ఎకరాల్లో 1972లో ఏర్పాటైన ఈ సంస్థ ఈ నెల 5న జరుపుకొంటున్న 50 ఏళ్ల ఉత్సవాలకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ప్రధానంగా కంది, జొన్న, వేరుసెనగ, సెనగ, సజ్జలు తదితర పంటలకు సంబంధించి వందల వంగడాలను ఆవిష్కరించిన ఈ సంస్థ కొత్తగా ‘పోషకాహార భద్రత’ కల్పించే, వాతావరణ మార్పులను తట్టుకునే వంగడాలపై పరిశోధనలు చేస్తోంది. కృత్రిమ మేధ(ఏఐ)తో సాగు పద్ధతుల్లో మార్పులు, భూసార పరీక్షలతో పంటల ఉత్పాదకత పెంపు లక్ష్యంగా పలు ప్రాజెక్టులు అమలు చేస్తోంది.
డాక్టర్ ఎం.ఎస్.స్వామినాథన్ సూచనతో
PM Modi Will Attend ICRISAT Golden Jubilee : ప్రపంచ ఆహారభద్రత లక్ష్యంగా రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ.. థాయ్‌లాండ్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ(ఇరి)లో జొన్న, తృణధాన్యాల పంటలకు వేర్వేరుగా రెండు అంతర్జాతీయ పరిశోధన సంస్థలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. రెండు వేర్వేరు సంస్థలకన్నా సమశీతోష్ణ మండల ప్రాంతంలో ఉన్న అన్ని దేశాలకు ఉపయోగపడేలా జొన్న, తృణధాన్యాల పరిశోధనకు ఒకే పరిశోధన సంస్థ ఏర్పాటు చేయడం మేలని అప్పటి భారత వ్యవసాయ పరిశోధన మండలి సంచాలకుడు డాక్టర్ ఎం.ఎస్.స్వామినాథన్ సూచించడంతో ఇక్కడ ఏర్పాటు చేశారు.
‘బయోఫోర్టిఫైడ్’ వంగడాలపై దృష్టి
ICRISAT Golden Jubilee : పోషకాహార లోపం పెద్ద సమస్యగా మారుతున్న తరుణంలో పోషకాలు నిండిన పంటలు పండించే దిశగా ప్రత్యేక (బయోఫోర్టిఫైడ్) వంగడాల ఆవిష్కరణపై ఇక్రిశాట్ దృష్టిపెట్టింది. ఉదాహరణకు కెన్యా దేశంలో పండే రాగి పంటలో ఇనుము, జింక్ ఎక్కువగా ఉండే వంగడాలు తీసుకుని వాటిని మరింత అభివృద్ధి చేసి తెలంగాణ, ఏపీ, ఉత్తరాఖండ్‌లో ప్రయోగాత్మకంగా పండిస్తోంది. వేరుసెనగ గింజల్లో నూనె శాతం అధికంగా ఉండే వంగడాలను 2020లో ఈ సంస్థ విడుదల చేసింది. వీటి విత్తనోత్పత్తికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొంది. ఒడిశా నేలల్లో భూసారంపై 2020లో డిజిటల్ పటాన్ని విడుదల చేసింది. ఉత్తర్‌ప్రదేశ్ బుందేల్‌ఖండ్‌లో పురాతన నీటివనరుల పరిరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు వివిధ రకాల పంటలకు సంబంధించిన 2,490 టన్నుల విత్తనం ఉత్పత్తి చేసింది. కంది, జొన్న, వేరుసెనగ, సజ్జలు తదితర 5 పంటలకు చెందిన 24 రకాల నూతన వంగడాలు విడుదల చేసింది.
పటాన్‌చెరులోనే ఎందుకంటే?
ICRISAT Golden Jubilee Celebrations : ఇక్రిశాట్‌ను పటాన్‌చెరులో ఏర్పాటుచేయడానికి ముందు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారీ కసరత్తు జరిగింది. అప్పట్లో ఈ కేంద్రం ఏర్పాటుకు మన దేశంలో బెంగళూరు నుంచి గట్టి పోటీ ఏర్పడింది. దక్కన్ పీఠభూమిలోని హైదరాబాద్ ప్రాంతం విభిన్న నేలలతో తృణ, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటల సాగుకు అనుకూలంగా ఉండడం ఒక విశేషం కాగా.. పటాన్‌చెరు ప్రాంతంలో పక్కపక్కనే నల్లరేగడి, ఎర్రమట్టి నేలలు ఉండడం అంతర్జాతీయ నిపుణులను ఆకర్షించింది. దీనికితోడు హైదరాబాద్‌లో ఉండే అనుకూల వాతావరణమూ ఇటే మొగ్గుచూపేలా చేసింది.
విష పదార్థాన్ని గుర్తించే కిట్ ఆవిష్కరణతో ప్రత్యేక గుర్తింపు
వేరుసెనగ గింజ(పల్లీ)ల్లో ‘అఫ్లోటాక్సిన్’ అనే విషపూరిత పదార్థాన్ని సులభంగా గుర్తించే కిట్‌ను ఇక్రిశాట్ రూపొందించింది. ఈ సంస్థ సాధించిన పెద్ద విజయాల్లో ఇది ఒకటిగా చెబుతారు. కోళ్ల దాణా కోసం 1970లో బ్రిటన్ వ్యాపారులు బ్రెజిల్ నుంచి పల్లీల వ్యర్థాలను దిగుమతి చేసుకున్నారు. అందులో ‘అఫ్లోటాక్సిన్’ ఉండటంతో ఆ దాణా తిన్న వేల కోళ్లు చనిపోయాయి. ఈ అంశంపై దృష్టి సారించిన ఇక్రిశాట్ లోతైన పరిశోధనలు చేసి ‘అఫ్లోటాక్సిన్’ను సులభంగా గుర్తించే పరికరాలను కనుగొని ప్రపంచానికి అందించింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!