Modi Hyderabad Tour: జులై 2, 3వ తేదీల్లో హైదరాబాద్ హెచ్ఐసీసీలో నిర్వహించనున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. జులై 2న మధ్యాహ్నం నరేంద్రమోదీ హైదరాబాద్‌కు రానున్నారు. బేగంపేట విమనాశ్రయం నుంచి నేరుగా హెలికాప్టర్లో హెచ్‌ఐసీసీ నోవాటెల్ హోటల్‌కు వెళ్తారు. ఇందుకోసం.. నోవాటెల్ హోటల్ వద్ద తాత్కాలిక హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తున్నారు. అగ్నిపథ్ ఆందోళనలు, నగర ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మోదీ హెలికాప్టర్లోనే నోవాటెల్‌కు వెళ్లాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా.. ప్రధానితో పాటు 40 మంది భాజపా ప్రముఖులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవనున్న ఈ సమావేశాల్లో.. ఒక పూట తెలంగాణ వంటకాలు ఏర్పాటు చేయనున్నారు.
హైదరాబాద్‌లో ప్రధాని పర్యటన దృష్ట్యా రాష్ట్ర పోలీసుశాఖ భారీ భద్రత ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానితోపాటు 40 మంది కేంద్ర ప్రముఖులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, వందల మంది పార్టీ నాయకులు రెండు రోజులపాటు నగరంలో బసచేయనుండటంతో వారి భద్రతను అధికారులు సవాలుగా తీసుకుంటున్నారు. ఎక్కడా ఏ చిన్న పొరపాటుకూ తావులేకుండా పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయడంలో తెలంగాణ పోలీసు శాఖ నిమగ్నమైంది.
మూడో తారీఖున సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ సభకు విజయ సంకల్ఫ సభగా నామకరణం చేశారు. రాష్ట్రంలో భాజపా పాలసీ ప్రకటించడానికి, ప్రజలను చైతన్యం చేయడానికే ఈ సభ ఏర్పాటు చేస్తున్నట్టు చెబుతున్న కమలనాథులు.. 10 లక్షల మందిని తరలించాలని లక్ష్యం పెట్టుకున్నారు. చరిత్రలో నిలిచిపోయేవిధంగా ఈ సభ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెబుతున్నారు. కార్యకర్తలు, ప్రజలు సభకు స్వచ్ఛందంగా తరలిరావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు సభా వేదిక ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
ఇవీ చూడండి: