ఏపీలో బస్సు ఛార్జీల పెంపుపై ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు పంపిన దస్త్రానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ఆమోద ముద్ర వేశారు. అనంతరం ఛార్జీల పెంపు నిర్ణయాన్ని అధికారులు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో కిలోమీటర్‌కు 10 పైసలు చొప్పున ఛార్జీలు పెంచారు. ఈ బస్సుల్లో తొలి రెండు స్టేజీలు లేదా పది కిలోమీటర్ల వరకు ఛార్జీలను పెంచలేదు. ఆ తర్వాత 75 కిలోమీటర్ల వరకు 5 రూపాయలు పెంచారు. దూర ప్రాంత ప్రయాణికులపై ఆర్టీసీ ఛార్జీల మోత మోగించింది. నాన్ ఏసీ కేటగిరీలోని ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున పెంచుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఏసీ కేటగిరీ వెన్నెల స్లీపర్ బస్సుల్లో మాత్రం ఛార్జీలు పెంచలేదు. ఇంద్ర, గరుడ, అమరావతి బస్సుల్లో కిలోమీటర్‌కు పది పైసలు చొప్పున ఛార్జీలు పెంచారు. సిటీ, ఆర్డినరీ బస్సుల్లో మొదటి 11 స్టేజీలు అంటే 22 కిలోమీటర్ల వరకు ఛార్జీలు పెంచడం లేదని ఆర్టీసీ తెలిపింది. అనంతరం కిలోమీటర్‌కు 10 పైసల చొప్పున ఛార్జీ పెంచి వసూలు చేయనున్నారు.
తప్పని పరిస్థితుల్లోనే..
2015 అక్టోబర్‌లో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచారు. అనంతరం ఇప్పుడు మళ్లీ పెరిగాయి. గడచిన నాలుగు సంవత్సరాల్లో డీజిల్ ధరలు 49 రూపాయల నుంచి 70 రూపాయలకు పెరిగాయని ఆర్టీసీ తెలిపింది. దీనివల్ల సంస్థపై ఏటా రూ.630 కోట్ల భారం పడిందని తెలిపింది. బస్సుల విడి భాగాల ధరలు పెరుగుదల సహా సిబ్బంది జీతభత్యాల పెంపు పల్ల మరో రూ.650 కోట్ల భారం సంస్థపై పడిందని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఛార్జీలను పెంచాల్సి వచ్చిందని ఆర్టీసీ ఎండీ ఎం.టీ. కృష్ణబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఈ పెంపు వల్ల ఏటా సుమారు రూ.700 కోట్ల రూపాయల రాబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి: బంగారు టాయ్‌లెట్‌ను దొంగలెత్తుకెళ్లారు..!