యూకేలో ప్రతిష్ఠాత్మకంగా భావించే బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ -2 నూతన సంవత్సర గౌరవార్థ జాబితాలో కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ పి. రఘురాం ఎంపికయ్యారు. భారత మూలాలున్న ఓ యువ సర్జన్, గత వందేళ్లలో ఆర్డర్ ఆఫ్ బ్రిటీష్ ఎంపైర్ గుర్తింపును అతిపిన్న వయసులో సాధించారు.
ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా భారత్‌లో క్యాన్సర్ కేర్, సర్జికల్ ఎడ్యుకేషన్‌ను ఆయన ప్రోత్సహిస్తున్నారు. దీని ద్వారా బ్రిటన్-భారత్‌ల మధ్య సత్సంబంధాలను ప్రోత్సహించినందుకు గాను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు 2021 హానర్స్ కమిటీ పేర్కొంది. ఈ పురస్కారానికి ఎంపికవడం పట్ల డాక్టర్ రఘురాం సంతోషం వ్యక్తం చేశారు. తన సేవలను విస్తరించేందుకు ఇదొక నూతన ఉత్తేజాన్ని ఇస్తుందన్నారు. ఈ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన కుటుంబసభ్యులు, కిమ్స్ హాస్పిటల్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: నూతన సంవత్సర వేడుకలకు యాదాద్రి సిద్ధం