Draupadi Murmu meet CBN: ఏపీలోని విజయవాడలో రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పర్యటన కొనసాగుతోంది. తాజ్ గేట్ వే హోటల్ వద్ద ద్రౌపది ముర్ముకు తెదేపా అధినేత చంద్రబాబు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సోము వీర్రాజు, సీఎం రమేష్, జీవీఎల్, మాధవ్, వాకాటి నారాయణరెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం తెదేపా ఎమ్మెల్యేలను ద్రౌపది ముర్ముకు చంద్రబాబు పరిచయం చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపినందుకు ముర్ము కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును చంద్రబాబు సత్కరించారు.
ప్రజాస్వామ్యంలో భారత్ ఎంతో పరిణతి చెందింది. భారత్ అభివృద్ధిలో వాజ్‌పేయీ ప్రముఖ పాత్ర పోషించారు. వాజ్‌పేయీ వచ్చిన తర్వాతే ఎస్టీకి మంత్రివర్గంలో స్థానం లభించింది. సమాజానికి దూరంగా ఉన్న వ్యక్తుల గురించి ఆలోచించిన వ్యక్తి వాజ్‌పేయీ. అనంతరం ఇనాళ్లకు మళ్లీ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్మును నిలపడం రాజకీయ అవసరం కాదు. కేవలం సామాజిక బాధ్యతే.
- సోము వీర్రాజు, ఏపీ భాజపా అధ్యక్షుడు
రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్ము నిలవడం సంతోషంగా ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఓ ఆదివాసీ మహిళ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక కావడం సంతోషకరమైన విషయన్నారు. సామాజిక న్యాయం కోసం ఏర్పాటు చేసిన పార్టీ తెదేపా అని.. ఎంతో మందికి ఉన్నత పదవులు కూడా ఇప్పించిందన్నారు. ఎమ్మెల్యే, మంత్రిగా, గవర్నర్‌గా ముర్ముకు విశేష అనుభవం ఉంది.. అలాంటి వ్యక్తికి మద్దతు తెలపడం అందరి అదృష్టమని అచ్చెన్నాయుడు తెలిపారు.
ద్రౌపది ముర్ము వివిధ హోదాల్లో పని చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. స్వాతంత్య్రం తర్వాత ఎక్కువ కాలం మహిళా గవర్నర్‌గా చేసిన వ్యక్తి ముర్ము అని కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో తొలిసారిగా గిరిజన మహిళ రాష్ట్రపతి అభ్యర్థిగా నిలుస్తోందని.. దేశవ్యాప్తంగా 42 పార్టీలు ముర్ముకు మద్దతు తెలుపుతున్నాయన్నారు.
రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికలో భాగస్వామ్యం కావడం అందరి అదృష్టం. పేద కుటుంబంలో జన్మించిన ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము. మారుమూల గ్రామంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగింది. సామాజిక న్యాయం కోసం ముర్మును బలపరిచాలని తెదేపా నిర్ణయించింది. రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్మును ఎంపిక చేసిన మోదీని అభినందిస్తున్నాను. గతంలో అబ్దుల్ కలాం, రామ్‌నాథ్ కోవింద్ ఎన్నిక వేళ సైతం తెదేపా మద్దతు తెలిపింది. - చంద్రబాబు, తెదేపా అధినేత
ఇదీ చదవండి: