ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్‌లో జరిగిన హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. కాకినాడ గ్రామీణ మండలం రమణయ్యపేట సచివాలయంలో వాలంటీర్‌గా పనిచేస్తున్న 32 ఏళ్ల లక్ష్మి.. 7 నెలల గర్భిణి. కరోనా సోకి 9 రోజులపాటు మహమ్మారితో పోరాడింది. చివరికి మృత్యువు ముందు ఓటమి చెందింది.
లక్ష్మి మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. జీజీహెచ్‌లో సరిగా చికిత్స అందడం లేదని రెండు రోజుల క్రితం ఆమె సెల్ఫీ వీడియో తీశారు. ఆక్సిజన్ అందక ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందని తెలిపారు. చివరి క్షణాల్లో ఆమె ఊపిరి ఎంతో కష్టంగా తీసుకున్న దృశ్యాలు.. మనసుని కలిచేవేస్తున్నాయి.