రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటుతున్నాయి. రానున్న వారం రోజులపాటు ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే ప్రమాదముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఎండల్లో తిరిగితే ఏం జరుగుతుంది?
- ఒంట్లో నుంచి నీరు, ఖనిజాలు, లవణాలు చెమట రూపంలో ధారాళంగా బయటకు పోతాయి. నిస్సత్తువ ఆవహిస్తుంది. దీన్నే వైద్య పరిభాషలో ‘డీహైడ్రేషన్’ అంటారు. ఈ పరిస్థితుల్లో అత్యవసరంగా శరీరంలో నీటిని, లవణాలను భర్తీ చేయాలి. లేని పక్షంలో శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ దెబ్బతింటుంది. ఫలితంగా శరీరంలో వేడి అంతకంతకూ పెరిగిపోయి మనుషులు కుప్పకూలిపోతారు. ఈ స్థితినే ‘వడదెబ్బ’గా పిలుస్తారు.
- డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు రక్తం చిక్కబడుతుంది. ఫలితంగా రక్త ప్రవాహం నెమ్మదిస్తుంది. ఒక్కోసారి గడ్డకడుతుంది. రక్తం గడ్డకడితే సిరల గోడలు చిట్లిపోయి, మెదడులో తీవ్ర రక్తస్రావం జరుగుతుంది.
పసిగట్టేదెలా?
తీవ్రమైన తలనొప్పి, మూర్ఛ, కళ్లు తిరగడం, మాట తడబడటం, తీవ్రమైన నీరసం, కాళ్లు,చేతుల్లో తిమ్మిర్లు, చూపు మందగించడం, మత్తుగా ఉండడం వంటివి వడదెబ్బ లక్షణాలు. గమనించిన వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి.
ఎలా జాగ్రత్తపడాలి?
- ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకపోవడమే మంచిది.
- తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే ముందే తగినంత నీరు తాగాలి.
- టోపీ ధరించాలి. తలకు తువ్వాలు లేదా చేతి రుమాలైనా కట్టుకోవాలి.
- వాంతులు, విరేచనాలు అవుతున్నప్పుడు ఓఆర్‌ఎస్ ద్రావణాన్ని తాగించాలి.
- వడదెబ్బకు గురైన వారి శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల ఫారన్‌హీట్ కంటే తక్కువకు చేరే వరకు తడి లేదా చల్లటి నీటిలో ముంచిన వస్త్రంతో తుడుస్తూ ఉండాలి.
- అయినా సాధారణ స్థితికి రాకపోతే దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాలి.
ఎవరిలో ముప్పు ఎక్కువ?
- ఎక్కువగా డీహైడ్రేషన్‌కు గురైన వారిలో
- సిగరెట్ తాగే వారిలో
- పక్షవాతం బాధితుల్లో
- గర్భ నిరోధక మాత్రలు వాడుతున్న వ్యక్తుల్లో
- ప్రసవానంతరం రక్తం చిక్కగా ఉన్న వారిలో
- కొన్ని రకాల క్యాన్సర్ రోగుల్లో
వేసవిలో ఎక్కువ ముప్పు
రక్త ప్రవాహం నెమ్మదించినప్పుడు, రక్తనాళాల్లో కవాటాలు(వాల్వ్) దెబ్బతినప్పుడు, రక్తం గడ్డకట్టే పదార్థాలు ఉన్నప్పుడు సిరల్లో రక్త ప్రవాహం నిలిచిపోతుంది. ఎండాకాలంలో సిరల్లో రక్తం గడ్డకట్టే కేసులు ఎక్కువగా వస్తుంటాయి. నెలకు 10-15 శస్త్ర చికిత్సలు చేస్తుంటాం. 30 శాతం మందిలో ఇది ప్రాణాంతక సమస్యే. కొందరు ఉపవాస దీక్షలు చేస్తూ కూడా నీళ్లు తాగరు. మరికొందరు ఎండల్లో తిరుగుతున్నప్పుడూ తగినంతగా నీరు తీసుకోరు. ఇవన్నీ సమస్యను పెంచుతాయి.
- డాక్టర్ బీజే రాజేశ్, న్యూరో సర్జన్