విద్యుత్ ఉద్యోగుల విభజనను వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఏకసభ్య కమిటీ న్యాయమూర్తి ధర్మాధికారిని కలిసి విజ్ఞప్తి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల విద్యుత్ సంస్థల యజమాన్య ప్రతినిధుల సమావేశం హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్‌లో జరిగింది. టీఎస్‌పీఈఏ అధ్యక్షులు పి.రత్నాకర్ రావు, ప్రధాన కార్యదర్శి పి.సదానందంలతో పాటు ఇతర ఇంజనీర్లు జస్టిస్ ధర్మాధికారిని కలిసి స్థానికత ఆధారంగా విద్యుత్ ఉద్యోగుల విభజన పూర్తి చేయలని కోరుతూ వినతి పత్రం అందజేసారు.
ఉత్తర్వులు అమలు చేయని కారణంగా నియామకాలలో జరిగిన అన్యాయాన్ని పరిగణలోకి తీసుకొని స్థానికత ఆధారంగా విభజన పూర్తి చేయాలని కోరారు. విద్యుత్ ఉద్యోగుల విభజన ఏకసభ్య కమిటి న్యాయమూర్తి ధర్మాధికారి మార్గదర్శకాలకు విరుద్ధంగా 582 మంది ఆంధ్ర ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థలకు కేటాయించారని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని నిరసిస్తూ... ఏ ప్రాంత ఉద్యోగులు అక్కడే పని చేయాలని నినాదాలు చేసారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రతినిధులు ప్లకార్డులతో ఆంధ్ర విద్యుత్ సంస్థలకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు.