Teachers Transfer: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోన్న ఉద్యోగుల బదిలీల్లో ఉపాధ్యాయుల ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. సీనియారిటీ జాబితాలో తప్పులున్నాయని, దంపతుల విభాగంలో తమకు పోస్టింగులు ఇవ్వాలని వేల సంఖ్యలో అప్పీళ్లు రావడంతో.. ప్రభుత్వం గత 10 రోజులుగా వాటిని పరిశీలిస్తూ తుది నిర్ణయం తీసుకోవడానికి తర్జనభర్జన పడింది. జిల్లాల కేటాయింపులో మొత్తం 23 వేల మంది వరకు జిల్లాలు మారగా.. బుధవారం(జనవరి 5) మధ్యాహ్నం నుంచి ఉపాధ్యాయులకు పోస్టింగ్లు కేటాయిస్తూ డీఈఓలు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల నేతల సమక్షంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా 13 కొత్త జిల్లాల్లో దంపతుల విభాగం కింద పోస్టులు ఇవ్వరాదని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాల్లోని వారు కూడా ఆ జిల్లాలకు బదిలీపై రావడం సాధ్యం కాదు కనుక రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్, సంగా రెడ్డి, సిద్దిపేట, మహబూబ్‌నగర్, మంచిర్యాల, సూర్యాపేట జిల్లాల్లో స్పౌజ్ పోస్టింగ్లను ప్రభుత్వం ఇవ్వలేదు. కానీ ఆ జిల్లాలకు భారీ సంఖ్యలో ఉద్యోగులు దరఖాస్తులు చేసుకున్నారు. పోస్టింగులు ఇస్తే ఆ జిల్లాల్లో మొత్తం ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుంది. అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అవకాశం ఉండదనే ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
మిగిలిన 19 జిల్లాల్లో అవకాశం ఇస్తూ.. గతంలో ఆ జిల్లాలకు ఆప్షన్లు ఇవ్వని వారు ఈ 19 జిల్లాలకు వెళ్లవచ్చని ప్రభుత్వం సూచించింది. అంతర్ జిల్లాల భార్యాభర్తల బదిలీలకు కూడా అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో ఆసిఫాబాద్, వికారాబాద్ జిల్లాల నుంచి జగిత్యాలకు, మంచిర్యాల నుంచి పెద్దపల్లి జిల్లాకు కూడా బదిలీలు జరిగాయి. గతంలో ఏ జిల్లాకు ఎంత మంది స్పౌజ్ పోస్టులను కేటాయించారు, వారి జాబితాను ఆయా జిల్లా అధికారులు బహిరంగ పరిచేవారు. ఈసారి ఎక్కడా అలాంటి జాబితాలను బయటకు రానీయలేదు. అభ్యంతరాలను పరిష్కరించకుండా ఏదో ఒక పోస్టింగ్ ఇస్తే ఎలా అనే ప్రశ్నలు ఉపాధ్యాయ సంఘాల నుంచి వస్తున్నాయి.
పోస్టింగులు కేటాయించడంలో సీనియారిటీని పరిగణలోకి తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. వికారాబాద్ నుంచి నారాయణపేట జిల్లాకు స్పౌజ్ కేటగిరీ కింద పీఈటీలు దరఖాస్తు చేసుకోగా... సీనియర్ ను కాదని జూనియర్‌ను పంపించారని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాతు సురేష్ ఆరోపించారు. నూతన జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులో బీసీలకు, మహిళలకు తీరని అన్యాయం జరిగిందని బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు ఆరోపించారు. జీఓ 317లో కేవలం ఎస్ సీ, బీసీ రిజర్వేషన్లు చూసి....బీసీ, మహిళలను చేర్చకపోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
ఇదీ చూడండి: