ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలిలో శనివారం రాత్రి 9 గంటలు దాటిన తర్వాత ఇసుక లారీ... విజయ్ అనే యువకుడ్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతని కాలు విరిగింది. అక్కడే ఉన్న కొంతమంది.. ఇసుక లారీని అక్కడే ఆపి గాయపడిన విజయ్‌ను ఆటోలో తరలించేందుకు ప్రయత్నం చేస్తున్న సమయంలో స్థానిక వైకాపా నాయకుడు కవల కృష్ణమూర్తి అక్కడికి చేరుకున్నారు. కారు హారన్ పదేపదే మోగించారు.
ఈ సంఘటనతో వివాదం ముదిరింది. విషయాన్ని వివరించి చెప్పబోయిన వరప్రసాద్ అనే యువకుడిని కారుతో ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఆయనకు గాయాలయ్యాయి. ఆ తర్వాత సోమవారం మధ్యాహ్నం సీతానగరం ఇన్‌ఛార్జి ఎస్సై ఫిరోజ్, కానిస్టేబుళ్లు... వరప్రసాద్ అనే ఎస్సీ యువకుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ తనను చిత్రహింసలకు గురిచేశారని.. చివరకు క్షౌరకుడిని తీసుకొచ్చి శిరోముండనం చేశారని వరప్రసాద్ చెప్పాడు.
సోమవారం స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు... మంగళవారం వేకువజామున విడిచిపెట్టారని వరప్రసాద్ తెలిపారు. అప్పటికే తీవ్ర గాయాలపాలైన తనను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారని పేర్కొన్నారు. ఇసుక లారీ అడ్డుకున్నందుకే స్థానిక వైకాపా నేతలు కక్ష కట్టి తనను అవమానించారని బాధితుడు వరప్రసాద్ ఆరోపిస్తున్నాడు. వీళ్లందరి నుంచి తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నాడు. తన కోసం వచ్చిన తల్లిపైనా పోలీసులు దుర్భాషలాడారని వరప్రసాద్ వివరించారు.
స్పందించిన డీజీపీ..
ఈ ఘటన తీవ్ర దుమారాన్నే రేపింది. సాయంత్రానికి స్పందించిన ఏపీ డీజీపీ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ సంఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై, కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. వారిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుకూ ఆదేశించారు. అంతకుముందే వెదుళ్లపల్లిలోని బాధితుడు వరప్రసాద్ ఇంటికి వెళ్లిన కోరుకొండ డీఎస్పీ విచారణ చేపట్టారు. సీతానగరంలో ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేశారు.
ఈ సంఘటనను రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు తీవ్రంగా తప్పుపట్టాయి. ప్రభుత్వం ఉదాసీనంగా ఉన్నందునే... వరుసగా ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించాయి.