ఈనెల 20న అమరావతి రాజకీయ ఐకాస, ప్రజాసంఘాల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజధాని పరిధిలోని రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు, రైతులకు సీఆర్పీసీ సెక్షన్ 149 కింద నోటీసులు ఇస్తున్నారు. అసెంబ్లీ ముట్టడితోపాటు, జైల్ భరో, గుంటూరు కలెక్టరేట్ ముట్టడి అంటూ పత్రికల్లో వచ్చిన ప్రకటనల ఆధారంగా నోటీసులు ఇస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సీపీఐ సీనియర్ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావుతోపాటు, రాజధాని అమరావతి ప్రాంతంలో ఉంటున్న తెదేపా నేతలకు పోలీసుల నోటీసులు అందాయి.
ఆందోళనల కారణంగా రహదారిపై వాహనాలు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం జరిగే ప్రమాదం ఉందని.. గొడవలు జరిగితే ప్రాణనష్టానికి దారితీయవచ్చని నోటీసుల్లో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.