ప్రజా భద్రతలో భాగంగా.. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా కంటిమీద కునుకు లేకుండా శ్రమించేతత్వం పోలీసులది. సంఘ విద్రోహశక్తులు, దోపిడీ దొంగల ఆట కట్టించేందుకు అహర్నిశలు శ్రమిస్తారు. విధి నిర్వహణలో అసువులు బాసిన వారిని స్మరించేందుకు ఏటా అక్టోబరు 21న పోలీసు అమరుల సంస్మరణ దినంగా నిర్వహిస్తున్నారు. ఈ సారి నుంచి పోలీసు ఫ్లాగ్‌డేగా నామకరణం చేశారు. దీనికి సంబంధించిన కార్యక్రమాలు ఈ నెల 31 వరకు కొనసాగనున్నాయి.
విపత్కర పరిస్థితుల్లో..
ప్రస్తుతం కరోనా వైరస్ అన్ని వర్గాలను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో ఏ మాత్రం వెరవకుండా రక్షకులు విధులు నిర్వర్తిస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఎవరినీ బయటకు రాకుండా చర్యలు తీసుకొని వైరస్ వ్యాపించకుండా కట్టుదిట్టంగా వ్యవహరించారు. తోటి సహచరులు మహమ్మారి బారినపడ్డా వెనుకడుగు వేయలేదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించి వైరస్ నుంచి రక్షణకు విధులు నిర్వర్తించారు. సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో తిండి దొరక్క అల్లాడుతున్న అభ్యాగులకు తమవంతుగా ఆహారం అందించి వారి ఆకలిని తీర్చారు.
* అత్యవసర సమయాల్లో ప్లాస్మా, రక్తదానం చేస్తూ సంగారెడ్డి జిల్లా పోలీసులు ఔదార్యం చాటుతున్నారు. ఐదురుగు ప్లాస్మా దానం చేశారు.
ప్రాణాలను ఫణంగా పెట్టి..
2012 మార్చి 28న.. అర్ధరాత్రి వేళ. కోహీర్‌లోని సిండికేట్ బ్యాంకులో అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు కలిసి బ్యాంకు దోపిడీకి పాల్పడగా.. సైరన్ మోగింది. ఈ విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న ఎస్‌ఐ నోముల వెంకటేశ్, హెడ్ కానిస్టేబుల్ భాస్కర్‌లు ద్విచక్ర వాహనంపై వెళ్లారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ప్రజలను గమనించిన దొంగలు వారు వెళ్లాక తమ పని కానిద్దామని పక్కనే అరటి తోటలో దాచుకున్నారు. దీన్ని గమనించిన పోలీసులు వారిని పట్టుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో దొంగలు నాటు తుపాకులతో ఐదు రౌండ్లు కాల్చారు. చివరి రౌండు తూటా ఎస్సైకి తగిలింది. ప్రాణాలను లెక్క చేయకుండా దోపిడీ దొంగలను పట్టుకున్నారు.
* ఇలా సంగారెడ్డి జిల్లాలో వివిధ ఠాణాల పరిధిలో పని చేస్తున్న, చేసిన పోలీసులు శాంతిభద్రతలకు తమవంతు పాత్ర పోషించారు. ఈ క్రమంలో పలువురు ప్రాణాలను సైతం కోల్పోయారు. ఆర్.సత్యనారాయణ (జిన్నారం), బి.జంగయ్య (సిర్గాపూర్), ఎల్లయ్య (సంగారెడ్డి), జె.సురేశ్ (కంగ్టి) అమరులైన వారిలో ఉన్నారు.
* వికారాబాద్ జిల్లాలో విధుల నిర్వహణలో, రహదారి ప్రమాదాల్లో 31 మంది వరకు మృత్యువాతపడ్డారు.
సాంకేతికత తోడుగా..
మారుతున్న పరిస్థితులను బట్టి పోలీసు శాఖలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కేసుల విచారణలో సాంకేతికతను విస్తృతంగా ఉపయో గించుకుంటున్నారు. కేసు నమోదు దగ్గరి నుంచి న్యాయస్థానంలో తీర్పు వెలువడే వరకు ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. స్టేషన్ల రూపురేఖలనూ మార్చేశారు. వికారాబాద్ జిల్లాలో హరితహారానికి ప్రాధాన్యం ఇచ్చిన శాఖ తరఫున 4 లక్షల వరకు మొక్కలు నాటి పచ్చదనం పెంచేందుకు అడుగులేశారు. అన్ని పట్టణాలు, గ్రామాల్లో నిఘానేత్రాల వల్ల కలిగే ప్రయోజనాన్ని వివరిస్తూ దాతలు, ప్రజల సహకారంతో ఏర్పాటుచేయిస్తున్నారు. ఇటీవల పలు కేసులు సైతం సీసీ కెమెరాల ఆధారంగా ఛేదించడం విశేషం. ఇక ఎప్పటికప్పుడు సాంకేతిక అంశాల్లో శిక్షణ సైతం ఇస్తున్నారు. ఇదే క్రమంలో శాఖల్లో ఖాళీగా ఉన్న ఆయా స్థానాలను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. నాలుగు జిల్లాల్లోనూ ఈ సమస్య వేధిస్తోంది. దీన్ని అధిగమిస్తే పురోగతి సాధించడానికి అవకాశం ఉంటుంది.