దొంగతనం జరిగితే పోలీసులొస్తారు. చోరీకి పల్పడ్డ దొంగలను పట్టుకుంటారు. వాళ్లు దొంగిలించిన సొమ్మును స్వాధీనం చేసుకుంటారు. ఇది అత్యంత సర్వసాధారణంగా జరిగే చర్య. అయితే.. 'పట్టుబడ్డ దొంగ దగ్గర నుంచి సొమ్ము కాజేస్తే ఎవరికి తెలుస్తుంది..? ఒకవేళ దొంగకు తెలిసినా.. దోచుకున్న సొమ్మే కాబట్టి నొక్కేసినా నోరు మెదపడు..' అనుకున్నట్టున్నాడు ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్. కానీ.. దొంగ దగ్గరే దొంగతనం చేసిన పోలీస్ స్టోరీ ఇప్పుడు వార్తాంశమై కూర్చుంది.
లారీ టైర్ల చోరీ కేసులో... బేగంబజార్‌కు చెందిన ఓ టైర్ల కంపెనీ యాజమాని కమల్ కబ్ర అగర్వాల్‌ను ఫిబ్రవరి నెలలో రాచకొండ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ క్రమంలో నిందితుని వద్ద ఉన్న డెబిడ్ కార్డు సీజ్ చేశారు. కాగా.. బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు.. తన బ్యాంకు ఖాతా నుంచి 5 లక్షలు మాయమైనట్టు గుర్తించాడు. బ్యాంకుకు వెళ్లి వివరాలు సేకరించగా.. పోలీసులు సీజ్ చేసిన డెబిట్ కార్డు ద్వారానే ఏటీఎం ద్వారా డబ్బులు డ్రా అయినట్లుగా తేలింది. వెంటనే.. తనకు జరిగిన అన్యాయంపై రాచకొండ పోలీసు ఉన్నతాధికారులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు.
ఈ ఘటనపై స్పందించిన రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్.. అంతర్గత విచారణకు ఆదేశించారు. నిందితున్ని రిమాండ్‌కు పంపిన సమయంలో డెబిట్ కార్డును సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ దేవెందరే స్వాధీనం చేసుకున్నారు. కాగా.. అధికారుల విచారణలో ఇన్‌స్పెక్టర్ దేవేందరే.. నిందితుని డెబిట్ కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసినట్లుగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ అనంతరం.. సదరు ఇన్‌స్పెక్టర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
జైలులో ఉన్న నిందితుడి బ్యాంక్ ఖాతా నుంచి 5 లక్షల నగదును స్వాహా చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ దేవేందర్ వ్యవహారంలో డీజీపీ మహేందర్‌రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇవీ చూడండి: