ప్రజామిత్ర పోలీసుతో సమాజానికి దగ్గరవుతున్న పోలీసులు విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలుసున్నారు. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తూనే సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైరస్ బారిన పడుతున్న పోలీసులకు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూనే... కొవిడ్ బాధితులు, నిరాశ్రయులు, అనాథలు, వృద్ధులకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో కమిషనర్ల ఆధ్వర్యంలో సేవలు అందిస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 12వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వారి ఆరోగ్యం దృష్ట్యా పేట్లబుర్జులోని సాయుధ బలగాల ప్రధాన కార్యాలయంలో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. కరోనా సోకిన పోలీసులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు.
వలస కూలీలకు అండగా...
లాక్‌డౌన్ వల్ల చాలా మంది ఉపాధి కోల్పోగా ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు స్వస్థలాలకు వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. వారికోసం కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల వద్ద సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. డబ్బులు లేక సొంతూళ్లకు వెళ్లలేని వారికి భోజన సౌకర్యం కల్పించడంతోపాటు... స్వచ్ఛంద సంస్థల సహకారంతో రైల్వే టికెట్లు ఇప్పించి గమ్యస్థానానికి చేర్చేలా ప్రయత్నిస్తున్నారు. గాంధీ, నిమ్స్, కింగ్ కోఠి ఆస్పత్రుల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి. బాధితుడి వివరాలు చెప్పిన 5 నిమిషాల్లో ఆరోగ్య పరిస్థితిని చెబుతున్నారు.
ఉచిత వైద్య సేవలు..
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని హైటెక్స్‌లో 50 పడకలతో.. ఉచిత కరోనా ఆస్పత్రిని ఆర్ట్ ఆఫ్ లివింగ్, జీహెచ్ఎంసీ సహకారంతో సజ్జనార్ ఏర్పాటు చేశారు. ఉచిత ఆక్సిజన్ సౌకర్యం కల్పించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ఇక్కడ ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. కరోనా బారిన పడి తల్లిదండ్రులు ఆస్పత్రి పాలైతే వారి చిన్నారుల సంరక్షణ కోసం సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక కేంద్రం ఏర్పాటుచేశారు. 080-45811215 నెంబర్‌కు ఫోన్ చేస్తే పోలీసులే వచ్చి చిన్నారులను చైల్డ్ కేర్ సెంటర్‌కు తీసుకెళ్తారు. ఫీడ్ ద నీడీ స్వచ్ఛంద సంస్థతో కలిసి కొవిడ్ మృతదేహాలను స్మశానవాటికకు తరలించేలా ప్రత్యేక అంబులెన్స్ సౌకర్యం కల్పించారు. పలు ఐటీ సంస్థల సహకారంతో 10 ప్రత్యేక వాహనాలను సజ్జనార్ అందుబాటులోకి తీసుకొచ్చారు.
మనోధైర్యం నింపుతూ...
రాచకొండ సీపీ మహేశ్ భగవత్ నేతృత్వంలో పలు సేవాకార్యక్రమాలు కొనసాగుతున్నాయి.ముఖ్యంగా కొవిడ్ బారిన పడి చాలా మంది మానసికంగా కుంగిపోతున్న వారి కోసం సైకో సోషల్ కౌన్సెలింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. 040-48214800 నెంబర్‌కు ఫోన్ చేస్తే మానసిక నిపుణులు... ఆన్‌లైన్‌లో తగిన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశారు. గర్భిణీలు, వృద్ధులు, మూత్రపిండ వ్యాధులతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకునేవారి కోసం 4 అంబులెన్సులు, 6 క్యాబ్‌ల ద్వారా ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తున్నారు. ఆశ్రమాల్లో ఉండే వృద్ధులు, చిన్నారులు, జాతీయ రహదారులపై రాకపోకలు సాగించే లారీ డ్రైవర్లకు... హర్యానా నాగరిక్ సమాజ్ ద్వారా భోజనం అందిస్తున్నారు.
వారి విధులు నిర్వర్తిస్తూనే... సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పోలీసులు... దేశంలో ఇతర రాష్ట్రాల పోలీసులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.