సాధారణంగా పెళ్లిళ్లు, విందు కార్యక్రమాల్లో చికెన్ సరిపోలేదని, మటన్ ముక్కలు రాలేదని, మర్యాదలు సరిగా జరగలేదంటూ.. జరిగే గొడవలను మనం చూసి ఉంటాం. కానీ.. వీటన్నింటికి భిన్నంగా ఏపీ సీఎం సొంత జిల్లా అయిన కడపలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ఇందులో పోలీసులను గ్రామస్థులు నిర్భందించడంతో ఆ విషయం అందరి దృష్టిని ఆకర్షించింది.
వినాయక చవితిలో భాగంగా ఏర్పాటు చేసిన అన్నదానంలో తిన్న విస్తరాకులను దగ్గరలోని ఓ బావిలో వేయడంతో జరిగిన గొడవ చినికి చినికి పెద్దదై చివరికి పోలీసులను నిర్భందించే స్థాయికి చేరింది. ఈ ఘటన కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం గంగనపల్లెలో చోటు చేసుకుంది.
అసలు గొడవ ఏంటంటే..!
కడప జిల్లాలోని గంగనపల్లెలో వినాయక చవితి సందర్భంగా స్థానికులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భోజనం అనంతరం విస్తరాకులను సమీపంలోని ఓ పాడుబడ్డ బావిలో పడేశారు. ఆ బావి తన స్థలంలో ఉందని.. ఎందుకు అందులో విస్తరాకులను వేశారు? అంటూ స్థానికులతో ఓ వ్యక్తి వాగ్వాదానికి దిగారు.
అంతటితో ఊరుకోని ఆ వ్యక్తి.. తనకు తెలిసిన ఓ రాజకీయ నాయకుడికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఘటనాస్థలానికి చేరుకుని.. ప్రాథమిక విచారణ జరపకుండా కొంతమంది మహిళలపై చేయి చేసుకుని తమ ప్రతాపం చూపారు. పోలీసుల చర్యలపై ఆగ్రహించిన గ్రామస్థులు ఏకమై.. అనవసరంగా ఎందుకు కొట్టారని పోలీసులను ప్రశ్నించారు. దీంతో పోలీసులకు స్థానికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామం వదిలి ఎలా వెళ్తారంటూ.. పోలీసుల వాహనాలను అడ్డుకున్న స్థానికులు.. వారిని ఎక్కడికీ వెళ్లకుండా నిలువరించారు. దాదాపు మూడు గంటల పాటు పోలీసులను కదలనివ్వకుండా చేశారు. విషయం తెలుసుకున్న కడప డీఎస్పీ సునీల్ ఘటనా స్థలానికి వెళ్లారు. అర్థరాత్రి వరకూ గ్రామస్థులతో చర్చ జరిపి రాజీ కుదిర్చారు.
ఇదీ చదవండి: వచ్చే ఏడాది నుంచి మండపంలోనే ఖైరతాబాద్ గణేష్ విగ్రహం నిమజ్జనం