ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇవ్వాల్సిన నిధుల వివాదం సమసిపోలేదు. 2013-14 ధరల ప్రకారమే తాము సాయం చేస్తామని గతంలో కేంద్ర ఆర్థికశాఖ విధించిన కొర్రీ నుంచి మినహాయింపు లభించకపోవడంతో బిల్లులు మంజూరు చేయించుకోవడం అధికారులకు తలకు మించిన భారం అవుతోంది. పోలవరం ప్రాజెక్టు బిల్లులకు కేంద్రం, పోలవరం అథారిటీ కొర్రీలు వేస్తున్నాయి. కొన్ని బిల్లులను తిప్పి పంపుతున్నాయి. గడిచిన వారంలో రూ. 333 కోట్లు ఖాతాకు జమ చేస్తున్నట్లు వర్తమానం అందింది. అవికాకుండా ఇంకా రూ.1,303 కోట్లు రావాలి. ఇందులో రూ.532.80 కోట్లు ఇవ్వబోమంటూ ఆ బిల్లులను తిప్పి పంపేశారు. 2013-14 ధరల ప్రకారం ఏపీకి ఇవ్వా ల్సిన నిధుల్లో ఆ విభాగాల కింద చెల్లించేది లేదంటూ కొన్ని బిల్లులను తిరస్కరించారు. పోలవరం కుడి, ఎడమ కాలువల విభాగాల కింద కేంద్రం ఆమోదించిన అంచనాల ప్రకారం ఇక నిధులు ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర అధికారులు చెబుతున్నారు. ఎడమకాలువ కింద ఖర్చు చేసిన రూ.169.10 కోట్లు, కుడి కాలువ కింద రూ.57.18 కోట్లు తిరస్కరించారు. ఇవి కాక మరికొన్ని బిల్లులనూ తిప్పి పంపారు.
రూ.20,398.61 కోట్లే..
పోలవరం ప్రాజెక్టుకు 2014 ఏప్రిల్ 1 నాటికి సాగు నీటి విభాగానికి అయ్యే ఖర్చునే ఇస్తామని గతేడాది అక్టోబరులో కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. అందులోనూ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి, ఇతరత్రా మినహాయించి రూ. 20.398 కోట్లే ఇస్తామన్నారు. దాంతో పాటు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి ముందు రూ.4.730 కోట్లు నీటి పారుదల విభాగం కింద ఖర్చయినందున ఇక ఆ విభాగం కింద ఇవ్వాల్సింది రూ.15,668 కోట్లుగా లెక్కించింది. ఆ తర్వాత రూ. 8,614.16 కోట్లు కేంద్రం ఇచ్చినందున ఇక పోలవరం ప్రాజెక్టుకు రూ.7.053.84 కోట్లే ఇస్తామని స్పష్టం చేశారు. ఏ విభాగం కింద ఎన్ని నిధులు ఇక రావాల్సి ఉందో కూడా లేఖలో వివరించారు. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో కూడా ఆ నిధులతో ప్రాజెక్టు పూర్తికాబోదని స్పష్టం చేసి 2017-18 ధరల ప్రకారం సాంకేతిక సలహా కమిటీ, రివైజు అంచనాల కమిటీ ఆమోదించిన మేరకు నిధులివ్వాలని కోరారు. తర్వాత దీనిపై ఆ రాష్ట్ర మంత్రులు, అధికారులు దిల్లీ వెళ్లి ప్రయత్నించినా ఫలితం దక్కకపోవడంతో కొర్రీలు వేస్తూనే ఇప్పుడు నిధుల విడుదలకు కొర్రీలు వేస్తున్నారు.
ఆ రూ.50 కోట్లూ ఇవ్వబోం..
విద్యుత్ కేంద్రం మట్టి తవ్వకం కింద రూ.50 కోట్లకు పోలవరం అధికారులు బిల్లులు సమర్పించారు. విద్యుత్ కేంద్రం పనులకు కేంద్రం నిధులు ఇవ్వబోదని, ఆ మెుత్తాన్ని తిరస్కరిస్తున్నామని తెలిపారు. ఇవి విద్యుత్ కేంద్రం పనుల్లోకి రాబోవని.. ప్రధాన డ్యాంకు అవసరమైన మట్టి, రాయి అక్కడి నుంచి తీసుకుంటున్నందున ఈ పని ప్రధాన డ్యాం పనుల్లో భాగంగానే వస్తుందని పోలవరం అధికారులు సమాధానమిచ్చారు. ఇలా విభాగాల వారీగా విడగొట్టి బిల్లులు తిప్పి పంపితే ప్రాజెక్టు పనులు ఆలస్యమవుతాయని ఏపీ జలవనరుల శాఖ ఉన్నతాధికారులు కేంద్ర జలవనరుల శాఖ ఉన్నతధికారికి లేఖ రాశారు. విభాగాల వారీగా చూడకుండా నిధులివ్వాలని కోరారు. రూ.20,398 కోట్లతో ప్రాజెక్టు పూర్తి చేయడం అసాధ్యమని, ఇలా చేస్తే కాలహరణం జరిగి ప్రాజెక్టు అంచనా వ్యయం పెరుగుతుందని మరోసారి తెలియజేసినట్లు పోలవరం అధికారులు చెప్పారు.
ఇదీ చదవండి: GHMC: ఇంజినీర్లు, సిబ్బంది బంధువులే గుత్తేదారులు