ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో చేపట్టిన దృశ్యమాధ్యమ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. కేంద్రం తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి పలు సూచనలు చేశారు. హైదరాబాద్‌లోని సీసీఎంబీని కరోనా పరీక్షల ల్యాబ్‌గా ఉపయోగించాలని సూచించారు. సీసీఎంబీలో పెద్ద సంఖ్యలో రోగ నిర్ధారణ పరీక్షలు చేసే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. దేశంలోని ప్రధాన నగరాలకు విదేశీ ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉందని... వారందరిని క్షుణ్ణంగా పరీక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
జనసమ్మర్థం అధికంగా ఉండే నగరాలపై దృష్టి కేంద్రీకరించాలని... విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారానే వైరస్ ప్రబలే అవకాశం ఉందని ప్రధానికి సీఎం కేసీఆర్ వివరించారు. కొన్నిరోజుల పాటు అంతర్జాతీయ విమాన సర్వీసులను పూర్తిగా నిలిపి వేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రైల్వే స్టేషన్లలోనూ క్షుణ్నంగా పరీక్షలు నిర్వహించాలని... రైళ్లలో శుభ్రతా చర్యలు చేపట్టాలని విన్నవించారు. రాష్ట్రంలో జనం గుమికూడకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఉగాది, శ్రీరామనవమి, జాగ్నేకి రాత్ వంటి ఉత్సవాలు రద్దు చేశామన్నారు. దేశంలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
ఇవీ చూడండి: సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్.. కరోనాపై చర్చ