ఆంధ్రప్రదేశ్ తిరుపతికి చెందిన సాయిప్రణీత్ అనే యువకుడిని ప్రధాని మోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రశంసించారు. సాయి ‘ఏపీ వెదర్ మ్యాన్’ పేరుతో వాతావరణ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మన్‌కీ బాత్ కార్యక్రమంలో సాయి ప్రణీత్‌ను ప్రధాని ప్రశంసించారు. సోషల్ మీడియా సాయంతో రైతులకు ఆ యువకుడు అందిస్తున్న సేవలను మోదీ మెచ్చుకున్నారు.
సాయి ప్రణీత్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. గత ఏడేళ్లుగా వాతావరణ అంశాలను విశ్లేషిస్తూ ఐఎండీ, ఐరాస ప్రశంసలు అందుకున్నారు. ఈ క్రమంలో ఆ యువకుడు అందిస్తున్న సేవలను తెలుసుకుని మన్‌కీబాత్ కార్యక్రమంలో మోదీ ప్రస్తావించారు.
మిత్రులారా... సాయి ప్రణీత్ కృషిని మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. తిరుపతికి చెందిన సాయి ప్రణీత్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. కఠిన వాతావరణ పరిస్థితుల వల్ల గతేడాది తనప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు పడటాన్ని గమనించాడు. వాతావరణ శాస్త్రంపై అతనికి ఏళ్లుగా అవగాహన ఉంది. ఆ ఆసక్తి, ప్రతిభతో రైతులకు మేలు చేకూర్చాలని నిర్ణయించుకున్నాడు. వివిధ మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించి, వాటిని అధ్యయనం చేసి తెలుగులోకి తర్జుమా చేశాడు. అలా వాతావరణానికి సంబంధించిన కీలక సమాచారాన్ని రైతులకు చేరవేస్తున్నాడు. అంతేకాకుండా వాతావరణ పరిస్థితులకు తగ్గుట్టు ఏం చేయాలో సూచనలు ఇస్తుంటాడు. ప్రకృతి విపత్తుల నుంచి పంటను ఎలా కాపాడుకోవాలో సలహాలు ఇస్తాడు.
-ప్రధాని మోదీ
ఇదీ చదవండి: SRSP: గోదావరికి తగ్గిన వరద ఉద్ధృతి.. ఎస్సారెస్పీ గేట్లు మూసివేత