రాష్ట్రంలో త్వరలో ప్రారంభించనున్న సమగ్ర భూ సర్వేకు సంబంధించిన కార్యాచరణ చేపట్టేందుకు ప్రభుత్వం పలు శాఖలతో కమిటీని ఏర్పాటు చేసింది. సర్వే ప్రక్రియతో సంబంధం ఉండే ప్రభుత్వ శాఖలు, విభాగాలను కమిటీలో భాగస్వామ్యులను చేసింది. భూమి కొలతలు, భూ దస్త్రాల నిర్వహణ, ఐటీ, సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ శాఖ, తెలంగాణ రాష్ట్ర సాంకేతిక శాఖలతోపాటు పలు విభాగాల బాధ్యులను సభ్యులుగా నియమించింది. రాష్ట్ర భౌగోళిక వాతావరణానికి అనువైన సర్వే ప్రక్రియ, టెండర్ల విధి విధానాలను కమిటీ నిర్ణయించనుంది.
రాష్ట్ర ప్రభుత్వం సర్వేకు రూ.400 కోట్లు కేటాయించడంతో త్వరలోనే టెండర్లు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. టెండరు పత్రాలను ఇప్పటికే సిద్ధం చేసి పెట్టారు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాగానే ఏప్రిల్ మొదటివారంలో టెండర్లు పూర్తి చేయనున్నట్లు సమాచారం. సర్వేకు వాతావరణం అనుకూలంగా ఉండే ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో ప్రాథమిక ప్రక్రియను పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. మొదట అటవీ, రెవెన్యూ భూముల సరిహద్దులు, గ్రామాల సరిహద్దులను (బౌండరీ) గుర్తిస్తారు. ఇవి పూర్తయ్యాకనే పట్టా భూముల జోలికి వెళ్లనున్నారు.
- ఇదీ చదవండి : యాదాద్రి ఆలయంలో మరో 32 మంది సిబ్బందికి కరోనా