జేఎన్‌టీయూలో పీహెచ్‌డీ ప్రవేశాల(JNTU Phd admission)పై దుమారం రేగింది. రిజర్వేషన్ల అమలులో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఈ విషయంలో గందరగోళం నెలకొనడంతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. జేఎన్‌టీయూలో పీహెచ్‌డీ ప్రవేశాల(JNTU Phd admission)కు 2020 ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ విడుదలైంది. 44 ఫుల్‌టైం, 188 పార్ట్‌టైం సీట్లకు నోటిఫికేషన్ ఇవ్వగా కరోనా కారణంగా ఈ ఏడాది జనవరిలో ప్రవేశ పరీక్షలు జరిగాయి. ఈనెల 10న ఫలితాలు విడుదల చేశారు. 183 సీట్లను అధికారులు భర్తీ చేశారు. నెట్, సెట్, గేట్, జీప్యాట్‌తోపాటు జేఎన్‌టీయూ అర్హత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు ప్రవేశాలు కల్పించారు.
రిజర్వేషన్ల ఉల్లంఘనతోపాటు అనర్హులకు సీట్లు దక్కాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సీట్లను ఓపెన్ కేటగిరీలోకి బదలాయించి భర్తీ చేశారని చెబుతున్నారు. నెట్ అర్హత ఉన్నప్పటికీ బీసీ-డీ విమెన్ సీటును బీసీ-ఏ పురుషుల విభాగంలోకి మార్చారని విద్యార్థి నాయకుడు జవ్వాజి దిలీప్ ఆరోపించారు. రసాయనశాస్త్రంలో ఓ వ్యక్తి అర్హత పరీక్షలో ఎంపిక కాకున్నా, ముఖాముఖికి హాజరు కాకుండానే ప్రవేశం కల్పించారని చెప్పారు. ఓపెన్ కేటగిరీలో 5 ఎస్సీ, ఒక ఎస్టీ, 29 మంది బీసీలకే అవకాశం ఇచ్చి, మిగిలిన సీట్లన్నీ ఓసీలకు కేటాయించడంతో అన్యాయం జరిగిందని విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్నారు.
నివేదిక ఇవ్వాలని ఆదేశం
పీహెచ్‌డీ ఫలితాల(JNTU Phd admission) వివాదంపై ప్రభుత్వం స్పందించింది. దీనిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉన్నత విద్యామండలిని ఆదేశించారు. ఆ మేరకు జేఎన్‌టీయూ(JNTU)ను మండలి నివేదిక కోరింది.
పారదర్శకంగా నిర్వహించాం
'పీహెచ్‌డీ ప్రవేశాలు(JNTU Phd admission) పూర్తి పారదర్శకంగా నిర్వహించాం. ప్రభుత్వం నిర్దేశించిన రిజర్వేషన్ ప్రకారమే అభ్యర్థుల ఎంపిక జరిగింది. ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదు.'
- ప్రొ.కట్టా నర్సింహారెడ్డి, ఉపకులపతి