హైదరాబాద్ కింగ్ కోఠి ఆస్పత్రి వద్ద వ్యాక్సినేషన్ కోసం రద్దీ ఏర్పడింది. రెండో డోసు గడువు ముగిస్తుండటంతో భారీగా తరలివచ్చిన ప్రజలు... ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నారు. హైదరాబాద్ హఫీజ్‌పేట పీహెచ్‌సీ వద్ద టీకా కోసం ప్రజలు పెద్దఎత్తున వరుస కట్టారు. అమీర్‌పేట్ పీహెచ్‌సీ వద్ద సైతం అదే పరిస్థితి నెలకొంది. రెండో డోసు కోసం భారీగా ప్రజలు తరలిరాగా... 200 మందికి కొవిషీల్డ్, మరో 150 మందికి కొవాగ్జిన్ ఇవ్వనున్నట్లు వైద్యాధికారి రేవతి వెల్లడించారు. హైదరాబాద్ ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ జనం బారులుతీరారు. ఉప్పల్ పీహెచ్‌సీలో ఉదయం నుంచి టీకాల కోసం క్యూలైన్లలో నిరీక్షిస్తున్నారు.
జిల్లాల్లోనూ..
కొవిడ్ టీకాల కోసం జిల్లాల్లోనూ భారీగా జనం తరలివస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 43 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా... అందుబాటులో 13,500 కొవిషీల్డ్, 800 కొవాగ్జిన్ డోసులు ఉన్నాయి. ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లాలో లక్షా 78 వేల మందికి టీకాలు వేశారు. మరోపక్క... నిజామాబాద్‌లోని 2 కేంద్రాల్లో మాత్రమే కొవాగ్జిన్ అందుబాటులో ఉండగా... వినాయక్‌నగర్, పోలీస్ లైన్ ఆస్పత్రిలో టీకాలు పంపిణీ చేస్తున్నారు. కొంతమందికి టోకెన్లు ఇచ్చి మిగిలిన వారిని వైద్య సిబ్బంది వెనక్కి పంపారు.
పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి రెండో డోసు కోసం భారీగా జనం తరలివచ్చారు. తొలి డోసు తీసుకుని 6 వారాలు పూర్తయిన వారికే టీకాలు వేస్తామని అధికారులు చెప్పడంతో... అధికారుల తీరుపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి : ఏపీ నుంచి వచ్చే కొవిడ్ రోగులను అనుమతించని పోలీసులు