రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నా..... కొందరు నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొందరి నిర్లక్ష్యం ఇతరుల్ని ప్రమాదంలోకి నెడుతోంది. నగరంలోని పలు ప్రాతాలు కొనుగోలుదారులు......... అమ్మకం దారులతో కిటకిటలాడుతుంటాయి. దుకాణాలు, ఇతర విక్రయ కేంద్రాల వద్ద అమ్మేవారు, కొనేవారు మాస్కులు మొక్కుబడిగానే పెట్టుకుంటున్నారు. మాస్కులు ధరించినవారు భౌతిక దూరం నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ముఖ్యంగా యువత పెద్దసంఖ్యలో ఓ దగ్గర గుమిగూడటం, రోడ్లపై పిచ్చాపాటి కబుర్లు, చాయ్ పే చర్చా వంటివి ఇంకా మానడంలేదు. కొవిడ్ ప్రభావం అంతకంతకూ పెరుగుతున్నా.... కొందరు బహిరంగ దూమపానం చేసి... ప్రజలను ప్రమాదంలోకి నెడుతున్నారు.
కోఠి, అబిడ్స్, దిల్‌సుఖ్‌నగర్, అమీర్‌పేట, సికింద్రాబాద్, కూకట్‌పల్లి వంటి ప్రాంతాల్లో నిత్యం వేల మంది ఫుట్‌పాత్‌లపై దుస్తులు సహా ఇతర వస్తువుల కొనుగోళ్లు జరుపుతుంటారు. అక్కడ భౌతికదూరం, మాస్కుల వాడకంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నించటం, మీడియా దృష్టి సారించినప్పుడే మాస్కులు పైకి ఎక్కిస్తున్నారు. లేకుంటే అలంకారప్రాయంగా గవద కిందకే వదిలేస్తున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కనీస జాగ్రత్తలు పాటించడంలోజనం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు . పని ప్రదేశాల్లోనూ... కొవిడ్ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు ఎంత చెప్పినా... కొందరు రోడ్లపై ఇష్టారీతిన తిరుగుతున్నారు. నిజామాబాద్ బస్టాండ్ ఆవరణలో కరోనా నిబంధనలు పాటించాలని ఆర్టీసీ అధికారులు ఎప్పటికప్పుడు మైక్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఎక్కువమంది మాస్క్ పెట్టుకున్నా భౌతికదూరాన్ని విస్మరిస్తున్నారు. ప్రయాణికులకు మాస్క్ ఉంటేనే టికెట్ ఇస్తున్నామని... లేదంటే బస్సు దింపేస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు.
జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు సహా రోడ్లపై ద్విచక్రవాహనదారులు ఎక్కువమంది మాస్క్ లేకుండా తిరుగుతున్నారు. మహారాష్ట్ర నుంచి బస్సులు, రైళ్లలో రాకపోకలు జోరుగా సాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో పని చేసేందుకు... మహారాష్ట్ర కూలీలు ఎక్కువ మంది వస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరి రాకపోకలపై నియంత్రణ పెంచాల్సిన అవసరముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కొవిడ్ కేసులు పెరుగుతుండటం అనేక మందిలో భయాందోళనలు మొదలై మాస్కులు ధరిస్తున్నా.. యువత, వర్తక, వ్యాపారులు మాస్కుల వాడకం, భౌతికదూరం వంటివి విస్మరిస్తున్నారు. ఇప్పటికైనా పక్కాగా ప్రతిఒక్కరూ నిబంధనలు పాటిస్తేనే కరోనాను కట్టడి చేయగలమని ప్రభుత్వం చెబుతోంది.