ఎండాకాలం సమీపిస్తున్నందున అగ్ని ప్రమాదాల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల అటవీ అధికారులను అటవీ ప్రధాన సంరక్షణాధికారి శోభ ఆదేశించారు. అటవీ సర్కిళ్ల చీఫ్ కన్జర్వేటర్లు, అన్ని జిల్లాల అటవీ అధికారులతో అరణ్య భవన్ నుంచి పీసీసీఎఫ్ దృశ్యమాధ్యమ సమీక్షించారు. ఎండాకాలంలో అడవుల రక్షణ, జంతువుల సంరక్షణ, నీటివసతి ఏర్పాటు, వచ్చే సీజన్ హరితహారం కోసం నర్సరీల సంసిద్ధత, పెద్దమొక్కల పెంపకం, అటవీ పునరుద్ధరణ పనుల పురోగతి, అటవీ అనుమతులపై సమావేశంలో చర్చించారు.
అగ్నిప్రమాదాలు జరగకముందే ముందస్తు నివారణా చర్యలతో అప్రమత్తంగా ఉండాలని... ప్రమాదాల తీవ్రత ఉండే ప్రాంతాల గుర్తింపు, నిఘా, క్షేత్రస్థాయి సిబ్బంది నడకతో పర్యవేక్షణ లాంటి చర్యలు చేపట్టాలని శోభ సూచించారు. అడవుల మీదుగా వెళ్లే రహదారుల్లో ప్రయాణికులకు అగ్నిప్రమాదాల నష్టంపై అవగాహన కల్పించాలని... ప్రమాద ప్రాంతాలకు తక్షణమే చేరుకునేలా అగ్నిమాపక యంత్రాలు, క్విక్ రెస్పాన్స్ బృందాలు ప్రతి జిల్లాలో అందుబాటులో ఉండాలని తెలిపారు. అడవుల్లో వన్యప్రాణులకు నీటి లభ్యత అంచనా వేయాలని... బహిరంగ ప్రదేశాలను జంతువులు రాకుండా తగిన నీటి వసతి, సాసర్ పిట్లను పున:సమీక్షించాలని పీసీసీఎఫ్ సూచించారు.
హరితహారం రానున్న సీజన్ కోసం అన్ని ప్రాంతాల్లో నర్సరీల సంసిద్ధత, పెద్ద మొక్కల పెంపకం జరగాలని తెలిపారు. ఈ ఏడాది మొక్కలు నాటే లక్ష్యం సుమారు 20 కోట్లుగా ఉండే అవకాశముందని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. వివిధ ప్రభుత్వ పథకాల కోసం జిల్లాల్లో పెండింగ్ లో ఉన్న అటవీ అనుమతుల ప్రక్రియను సమీక్షించి వేగవంతం చేయాలని తెలిపారు. అడవి పందుల కాల్చివేత ఆదేశాలు, అమలు అవుతున్న తీరుపై కూడా జిల్లాల అధికారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా రైతుల కోసం ఈ పనిచేస్తున్న షూటర్లు హుందాగా వ్యవహరించాలని కోరారు.