ఒక ప్రైవేట్ యాప్‌లో ప్రజల ఆస్తుల వివరాలను నమోదు చేస్తున్న ప్రభుత్వం వాటి రక్షణకు ఎలాంటి భరోసా ఇస్తుందో చెప్పాలని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి ప్రశ్నించారు. ధరణి యాప్‌లో ప్రజల ఆస్తులతోపాటు ఇతర వివరాలను నమోదు చేయడం సమగ్ర కుటుంబ సర్వేని తలపిస్తోందన్నారు. ధరణి పోర్టల్‌లో ఎందుకు ఆస్తుల వివరాలు నమోదు చేస్తున్నారో ప్రజలకు వివరంగా తెలియచెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ప్రజల్లో అనేక అపోహలు, అనుమానాలు ఉన్నాయని.. వాటిని నివృత్తి చేయాలన్నారు.
వ్యవసాయేతర ఆస్తులతోపాటు ఇతర వివరాలను అడిగి తెలుసుకోవడం వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ధరణి ద్వారా పాస్ పుస్తకాలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో సమగ్ర సర్వే మాదిరిగానే ఇవాళ ధరణి పోర్టల్ పేరుతో ఎన్నికల ప్రయోజనాల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు.