Revanth Reddy Comments: ధరణి పోర్టల్ పేరు చెప్పి భూముల జోలికి ఎవరైనా వస్తే... తిరగబడాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు సూచించారు. సీఎం కేసీఆర్ మాయమాటలు ఎవరు నమ్మరన్న రేవంత్ రెడ్డి.. ధరణి పోర్టల్ రద్దు చేసే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఇందిరాపార్కు వద్ద కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ధరణి, భూ సమస్యల రచ్చబండ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రేవంత్ రెడ్డి.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రెవెన్యూ సదస్సుల పేరుతో సీఎం కేసీఆర్ కొత్త నాటకానికి తెరతీశారని ఆరోపించారు.
వరంగల్ రైతు డిక్లరేషన్ సభలోనే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని చెప్పిన విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ధరణి అద్భుతమని, సర్వరోగ నివారిణిగా అభివర్ణించిన కేసీఆర్ ఇవాళ... అదే పేదల బతుకుల్లో నీళ్లు పోస్తోందని ఆరోపించారు. ధరణి తీసుకురావడం వల్ల రైతుల జీవితాలు ఆగమయ్యాయని ధ్వజమెత్తారు. మూడు చింతలపల్లి మండలం లక్ష్మాపూర్‌లో ధరణి మొదలు పెట్టి.. అక్కడ పేదలకిచ్చిన అసైన్డ్ భూమిని వివిధ కారణాలతో గుంజుకుంటుందని విమర్శించారు. వరంగల్‌లో కూడా డెవలప్మెంట్ పేరుతో లాక్కొనే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
"భూ పోరాటాలకు తెలంగాణ నిలయం. ఇక్కడ భూములను కన్నపిల్లలకంటే ఎక్కువగా చూసుకుంటారు. లక్ష్మాపూర్‌లో 800 మందికి పట్టాలివ్వకపోతే నేను కొట్లాడితే 200 మందికి ఇచ్చారు. తరతరాలుగా వస్తున్న భూమిని సర్కారే అన్యాయంగా లాక్కోవడం సిగ్గు చేటు. ఇప్పటివరకు రాష్ట్రంలో 30లక్షల ఎకరాల భూమి మాయమైంది. పేద ప్రజలు ఆత్మగౌరవంగా బతకాలని ఒకేసారి కాంగ్రెస్ ప్రభుత్వం పంచిన 25లక్షల ఎకరాల భూమితో పాటు 5లక్షల ఎకరాల పోడు భూములను కూడా ఆగం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో భూమే ఆత్మగౌరవం. దానినే దెబ్బతీసే ప్రయత్నం సీఎం కేసీఆర్ చేస్తున్నారు. పాత రికార్డులన్నీ మాయం చేసి.. రెవెన్యూ వ్యవస్థను తెరాస ప్రభుత్వం ఆగం చేసింది." -రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
ఇవీ చూడండి: