కాంగ్రెస్‌లో క్రమశిక్షణ అతిక్రమణ చర్యలను సహించేది లేదని పీసీసీ క్రమశిక్షణ కమిటీ హెచ్చరించింది. ఎవరైనా పార్టీ నియమావళి ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు తప్పవని.. కమిటీ ఛైర్మన్ కోదండరెడ్డి స్పష్టం చేశారు. పార్టీ పరంగా, నేతల నుంచి ఏం సమస్యలున్నా.. డీసీసీ, పీసీసీ స్థాయిల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
కోదండరెడ్డి అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు. కో ఛైర్మన్ శ్యామ్ మోహన్, కన్వీనర్ కమలాకర్‌రావు, సభ్యులు సంబాని చంద్రశేఖర్, సీజే శ్రీనివాస్ హాజరయ్యారు. నేతలపై అందుతున్న ఫిర్యాదులు, తీసుకుంటున్న చర్యలపై కమిటీ చర్చించింది. పార్టీ నాయకత్వానికి, సీనియర్ నేతలకు వ్యతిరేకంగా కొందరు కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు క్రమశిక్షణ కమిటీ పేర్కొంది. కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుందని.. ఎవరికైనా భేదాభిప్రాయాలుంటే పార్టీ వేదికల్లో ఫిర్యాదు చేయాలని కమిటీ సూచించింది. తీవ్రత ఆధారంగా ఏఐసీసీ దృష్టికి కూడా తీసుకెళ్లవచ్చునని కమిటీ ఛైర్మన్ కోదండరెడ్డి సూచించారు.