Revanth fire in vari deeksha: మోదీ, కేసీఆర్ కలిసి ధాన్యం కొనకుండా రైతులను మోసం చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్లో కాంగ్రెస్ చేపట్టిన వరిదీక్షలో పాల్గొన్న రేవంత్రెడ్డి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వ్యవసాయం దండగ కాదు పండుగ చేస్తా అన్న కేసీఆర్... ఇప్పుడు ధాన్యం ఎందుకు కొనుగోలు చేయట్లేదని నిలదీశారు.
రేవంత్ సవాల్..
కేసీఆర్, మోదీ వేర్వేరు కాదు.. ఇద్దరు బొమ్మాబొరుసు లాంటి వాళ్లేనని ఆరోపించారు. రెండు ప్రభుత్వాలు రైతు పక్షపాతులు కాదన్నారు. రైతులకు మద్దతుగా రాత్రి కూడా దీక్షస్థలిలోనే పడుకుంటామని తెలిపారు. పదివేల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తే.. రాష్ట్రంలో పండిన ప్రతీ గింజ కొనుగోలు చేస్తామని రేవంత్ పేర్కొన్నారు. దానితో పాటు రూ. 500 బోనస్ కూడా ఇచ్చి చూపిస్తామన్నారు. ఒక వేళ అలా చేయలేని పక్షంలో ఓట్లు అడగబోమని ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
పార్లమెంటులో తేల్చుకుంటాం..
"2004లో రూ.490 క్వింటాల్ ఉన్న వరి ధరను కాంగ్రెస్ వచ్చాక రూ.1030 కు పెంచింది. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ధాన్యం కొనుగోళ్లు దసరాకు మొదలై... దీపావళికి ముగియాల్సింది పోయి.. ఇంకా కల్లాల్లోనే ఉన్నాయి. ఇదంతా కేసీఆర్ సృష్టించిన గందరగోళమే. గోనె బస్తాలు కొనలేదు, రవాణా సౌకర్యం కల్పించలేదు. కల్లాల్లో పంట కొనకుండా యాసంగి పంట గురించి మాట్లాడుతున్నారు. రైతులు చస్తుంటే ముఖ్యమంత్రికి తిండి ఎలా సహిస్తోంది. రాష్ట్ర భాజపా నేతలకు గడ్డి పెట్టామని కేంద్ర మంత్రే చెప్పారు. దీన్ని బట్టి ఇద్దరూ తోడు దొంగలే అని తేలిపోయింది. భాజపా - తెరాస నేతలు సారా - సోడా లాంటోళ్లు... ఇద్దరు కలిసి దావత్ చేసుకుంటారు తప్ప రైతులకు న్యాయం చేయరు. ఇక్కడ తేలకపోతే పార్లమెంటులో మోదీ చొక్కా పట్టుకుంటాం. వైన్ షాపుల దరఖాస్తులకు వచ్చిన డబ్బులో సగం చాలు ధాన్యం మొత్తం కొనడానికి. వరి కొనకపోతే అంబేద్కర్ చౌరస్తాలో మోదీ - కేసీఆర్కు ఉరి ఖాయం. వడ్లు కొనకపోతే గద్దెమీద ఉండే అధికారం కేసీఆర్కు లేదు. రూ.10 వేల కోట్లు కాంగ్రెస్కు ఇవ్వు... ప్రతీ గింజ కొని చూపిస్తాం. రూ.1960 మద్ధతు ధరే కాదు... మరో రూ.500 బోసన్ కూడా ఇస్తాం. ఆ పని చేయలేకపోతే ఓట్లే అడగం" - రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
ఇవీ చూడండి: