నివర్ తుపాను నష్టంపై రైతులతో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఎకరాకు రూ. 22 వేల వరకు ఖర్చు అయిందని... ఇపుడు అది కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. పంట పొలాల పరిశీలన అనంతరం ఏపీలోని రేపల్లె పట్టణంలోని అంకమ్మ చెట్టు కూడలిలో ఏర్పాటు చేసిన సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు.
తుపాను కారణంగా పంట పొలాల్లో ఇంకా నీళ్లు నిలిచి ఉన్నాయన్నారు. జరిగిన నష్టం చూసి కొందరు రైతులు మరణించటంపై ఆవేదన వెలిబుచ్చారు. 151 మంది శాసనసభ్యులను గెలిపిస్తే వైకాపా ప్రభుత్వం ఏం చేస్తోందని పవన్ ప్రశ్నించారు. ప్రజల కష్టాలు వారికి పట్టడం లేదని విమర్శించారు. అసెంబ్లీలో బూతులు తిట్టుకోవటం మాని రైతుల కష్టాలు చూడాలన్నారు.
తుపాను కారణంగా కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని పవన్ అన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 35 వేలు పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ వ్యవస్థ ఉపయోగించుకుని త్వరగా పంట నష్టం పరిహారం ఇవ్వాలని సూచించారు. గతంలో భవన నిర్మాణ కార్మికుల కోసం అండగా నిలబడ్డామని... ఇపుడు అదే విధంగా వరద బాధిత రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని పవన్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు కోసం పటిష్ఠ ఏర్పాట్లు