ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే సినిమా టికెట్లు విక్రయించాలని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మాధవీలత స్పష్టంచేశారు. జిల్లాలో బెనిఫిట్ షోలు అదనపు షోలు నిర్వహించేందుకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పారు. టికెట్లు అధిక ధరకు విక్రయించినా, బ్లాక్ మార్కెట్‌లో అమ్మినా థియేటర్ యాజమాన్యాలతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చిత్తూరు జిల్లాలో...
భీమ్లా నాయక్ బెనిఫిట్ షో కు అనుమతి ఇవ్వాలని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సినిమాలను రాజకీయాలతో ముడిపెట్టరాదన్నారు. సినిమా టికెట్ ధరలు, బెనిఫిట్ షో ప్రదర్శనలపై ముందస్తుగా సినిమా థియేటర్ల యజమానులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం దారుణమన్నారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే సినీపరిశ్రమపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టిందంటూ పవన్ కల్యాణ్ అభిమానులు తిరుపతిలో నిరసన చేపట్టారు. గాంధీ విగ్రహ కూడలిలో మోకాళ్లపై నిలబడి ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లాలో...
జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సినిమా భీమ్లా నాయక్ విషయంలో ఏపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని పవన్ కల్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు సినిమా టికెట్ల విక్రయాలు ప్రారంభం కాలేదని మండిపడ్డారు. బెనిఫిట్ షో లేకపోవడం, టికెట్లు అందుబాటులోకి రాకపోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరు మీద విసుగెత్తిన అభిమానులు.. సినిమా చూసేందుకు హైదరాబాద్ వస్తున్నారు. ఒక్క సినిమా రిలీజ్ పట్ల ప్రభుత్వం ఎందుకంత కఠినంగా వ్యవహరిస్తోందంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మాచర్లలో నాగార్జున కళామందిర్ థియేటర్ వద్ద హుండీ ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. తమ అభిమాన నటుడి సినిమా వల్ల థియేటర్ యజమానులు, డిస్టిబ్యూటర్లు నష్టపోకూడదని.. హుండీ ద్వారా వచ్చే విరాళాలు వారికి అందజేయనున్నట్లు చెప్పారు.
తూర్పుగోదావరి జిల్లాలో...
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ఆయన అభిమానులు తూర్పుగోదావరి జిల్లా రాజోలులో నిరసన వ్యక్తం చేశారు. స్థానిక రెవెన్యూ కార్యాలయం ముందు భీమ్లా నాయక్ సినిమాకు బెనిఫిట్ షో ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. అభిమానులు. పవన్ సినిమాపై ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకశ పోకడలు విడనాడాలని, తెలంగాణలో లేని ఆంక్షలు ఆంధ్రలో ఏంటని అభిమానుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: