వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మరో అడుగు ముందుకేసి ప్రస్తుతం జనసేన ముందు మూడు మార్గాలే ఉన్నాయన్నారు. ఒకటి.. భాజపాతో కలిసి వెళ్లి ప్రభుత్వాన్ని స్థాపించడం.. రెండు.. భాజపా, తెదేపాతో వెళ్లి ప్రభుత్వాన్ని స్థాపించడం... మూడు.. మేమే ఒంటరిగా వెళ్లి ప్రభుత్వాన్ని స్థాపించడం. ఇవి తప్ప వేరే మార్గాలు లేవని అన్నారు. 'పోరాడితే పోయేదేం లేదు.. బానిస సంకెళ్లు తప్ప' అనేది తన విధానమని పవన్ చెప్పారు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అనే బైబిల్లో పేర్కొనబడిందని గుర్తు చేశారు. బైబిల్ సూక్తిని పాటించాలని తెదేపాను కోరుతున్నానని అన్నారు. తాము పార్టీ పెట్టాక 2014లో తగ్గామని.., 2019లోనూ తగ్గామని.., 2024లో మాత్రం తగ్గేందుకు తాము సిద్ధంగా లేమని అన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని తానే అని భాజపా నేతలు ఎవరూ చెప్పలేదని చెప్పారు. ఏపీలోని మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన.. గెలుపు ఎప్పుడూ మన ఐక్యతపై ఆధారపడి ఉంటుందన్నారు.
'ఎప్పుడూ ప్రత్యర్థులను చూస్తాం.. ముందు మనల్ని చూసుకోవాలి. అన్నిసార్లూ మనమే తగ్గాం... ఈసారి మిగతావాళ్లు తగ్గితే బాగుంటుంది. ఈసారి ప్రజలు గెలవాలని మేం కోరుకుంటున్నాం. పదవి అనేది ఎక్కువ సేవ చేసేందుకు అవసరం. అధికారం ఉంటే ఎక్కువగా ప్రజాసేవ చేయొచ్చు. పొత్తులకు సంబంధించి సరదాగా, తేలిగ్గా మాత్రమే చెప్పా. పొత్తులపై నా మాటలు తీవ్రంగా తీసుకుని గొడవలు పెట్టుకోవద్దు'. -పవన్, జనసేన అధినేత
కోనసీమ అలర్లు ప్రభుత్వ సృష్టే..: కోనసీమ అల్లర్లను కులఘర్షణలుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని పవన్ ఆరోపించారు. జనసేన సైద్ధాంతిక బలం కలిగిన పార్టీ అని.. దేశ రాజకీయాలన్నీ కులాలతో ముడిపడి ఉన్నాయనేది నిజమని చెప్పారు. ప్రస్తుత రాజకీయాల్లో గుణం కాదు.. కులం చూస్తున్నారని అన్నారు. కులాల ఐక్యత అనేది తమ పార్టీ బలమైన సిద్ధాంతమని చెప్పారు. ఎన్నికల్లో ఓట్ల కోసం కులాలకు కార్పొరేషన్లు పెడుతున్నారన్నారు. కోనసీమ అల్లర్ల సృష్టి ప్రభుత్వ విచ్ఛిన్నకర ధోరణికి నిదర్శనమన్నారు. కోనసీమ అల్లర్లను బహుజన ఐక్యతపై దాడిగా పరిగణిస్తున్నామని చెప్పారు.
వైకాపా నేతల ముందస్తు ప్రణాళిక ప్రకారమే కోనసీమ అల్లర్లు. ప్రశాంతమైన, పచ్చని కోనసీమలో చిచ్చు రేపారు. వైకాపా అనేది.. రౌడీల మూక.. గూండాల గుంపు. కావాలనే కోనసీమలో గొడవలు చేశారని తెలుస్తోంది. కోనసీమ అల్లర్లతో జనసేనకు ఏదో అవుతుందంటే అది మీ తెలివితక్కువ. నేను కులాలను కలిపేవాడిని.. విడదీసేవాడిని కాదు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే పని మేం ఎప్పుడూ చేయం. వైఎస్‌ఆర్‌సీపీ అంటే యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ. వైకాపా పాలనలో యువజనులకు ఉద్యోగాలు లేవు. వైకాపా పాలనలో శ్రామికులకు పనిలేదు. వైకాపా పాలనలో రైతులకు గిట్టుబాటు ధర లేదు. కులాలతో నడుస్తున్న సమాజంలో చిన్నచిన్న గొడవలు ఉంటాయి. కులం అంటే వచ్చే భావన.. ఆంధ్రా అంటే ఎందుకు రాదు ? రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు ఉందని పాలకులు గ్రహించాలి. అవినీతి అనేది రాజకీయాల్లో సహజంగా మారింది. అవినీతి పాలకులు ఏసీబీని నియంత్రించడం హాస్యాస్పదం. పాలకుల తప్పు వల్లే తెలంగాణ ఉద్యమం.. దానికి ప్రజలతో సంబంధం లేదు. ఇసుక అక్రమ రవాణా అరికడతామన్నారు.. అంతా ఒకే కంపెనీకి కట్టబెట్టారు.- పవన్, జనసేన అధినేత
వైకాపాది అదే ధోరణి: తమకు ఓటేయని వారిని వర్గశత్రువుగా చూసే ధోరణి వైకాపా పార్టీది అని పవన్ విమర్శించారు. కమ్మవారిని అన్నీ తిట్టేసి జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే ఓకేనా ? అని ప్రశ్నించారు. కమ్మవారిని వర్గశత్రువుగా వైకాపా చిత్రించిందని ఆరోపించారు. జనసేన వైపు ఉన్నారని కాపులనూ వర్గశత్రువుగా ప్రకటించారన్నారు. గోదావరి జిల్లాల్లో ఇకనుంచి వైకాపాను మరిచిపోవచ్చునని వ్యాఖ్యనించారు.
ఇవీ చూడండి: