రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రతిష్ఠాత్మకంగా కొనసాగుతోంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన పట్టణ ప్రగతి కార్యక్రమం నేటితో ఆరు రోజలు పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కార్యక్రమంలో భాగంగా నిర్దేశించుకున్న పనులను చేపట్టి లక్ష్యాలు చేరుకునే పనిలో పడ్డారు.
వ్యర్థాలను ఊడ్చేశారు...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా మిగతా 141 నగర, పురపాలికల్లో 26 వేలకు టన్నులకు పైగా వ్యర్థాలను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో ఇప్పటి వరకు 78 శాతం మేర 20 వేల టన్నులకు పైగా తొలగింపు పూర్తైంది. 11వేలకు టన్నులకు పైగా శిథిలాలకు గానూ ఇప్పటి వరకు తొమ్మిది వేల టన్నులకు పైగా తొలగించారు. 12 వేలకు పైగా మురుగు కాల్వలకు గానూ ఇప్పటి వరకు ఎనిమిది వేలకు పైగా శుభ్రం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,200 గుంతలను పూడ్చి వేశారు. 860 పాడుబడిన ఇళ్లను తొలగించారు.
మొక్కలు నాటారు...
హరితహారంలో భాగంగా 12 లక్షలకు పైగా మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా... ఇప్పటి వరకు ఆరు లక్షలా 78 వేలకు పైగా మొక్కలు నాటారు. రహదార్ల వెంట, మధ్యలో, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటారు. ప్రతి ఇంటికీ ఆరు చొప్పున 15 లక్షలకు పైగా మొక్కలు పంపిణీ చేశారు. 6,984 కిలోమీటర్ల మేర రహదార్ల వెంట బహుళ వరుసల్లో మొక్కలు నాటాల్సి ఉండగా... ఇప్పటి వరకు 720 కిలోమీటర్ల మేర మాత్రమే పూర్తి చేశారు. పట్టణప్రాంతాల్లో మొక్కలు నాటి బాగా సంరక్షిస్తున్న 413 జంటలకు ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు సన్మానించారు.
అభివృద్ధి పనులకు శ్రీకారం..
విద్యుత్ సమస్యల పరిష్కారంలో భాగంగా 1,108 మీటర్లకు మరమ్మత్తులు చేశారు. పాడైన 772 స్తంభాల స్థానంలో కొత్త వాటిని నాటారు. 26వేల మీటర్ల మేర విద్యుత్ లైన్లను సరిచేశారు. లక్ష్యంగా నిర్ధేశించుకున్న 63 సమీకృత శాఖాహార, మాంసాహార మార్కెట్ల నిర్మాణానికి గానూ ఇప్పటి వరకు 36 చోట్ల టెండర్లు ఖరారు చేశారు. 101 వైకుంఠధామాల నిర్మాణానికి కూడా టెండర్లు ఖరారు చేశారు. 78 చోట్ల పనులు ప్రారంభమయ్యాయి.
ఎప్పటికప్పుడు నివేదికలు
పది రోజుల పట్టణప్రగతి కార్యక్రమం కోసం గుర్తించిన 7,147 బస్తీలకు గానూ ఇప్పటి వరకు 6,184 బస్తీల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించారు. పట్టణప్రగతి జరుగుతున్న తీరుపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల ద్వారా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. మున్సిపల్ కమిషనర్లు కూడా రోజు వారీ పురోగతిని ఎప్పటికప్పుడు నివేదిస్తున్నారు.