Parliamentary standing committee meeting on Commerce: హైదరాబాద్‌లో అసెంబ్లీ కమిటీ హాల్లో వాణిజ్యశాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం భేటీ అయింది. ఛైర్మన్ విజయసాయిరెడ్డి నేతృత్వంలో పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం జరిగింది. సమావేశంలో పలువురు కమిటీ సభ్యులు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల ప్రతినిధులు, బ్యాంకింగ్, ఈ- కామర్స్ సంస్థలకు చెందిన సీనియర్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఏపీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ- కామర్స్ రంగానికి ప్రోత్సాహం, నియంత్రణ తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయం, వివక్షను సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు.
కేంద్రం శీతకన్ను: విభజన హామీలు అమలు చేయకుండా కేంద్రం మొండిచేయి చూపుతోందని కేటీఆర్ ఆరోపించారు. వివిధ పథకాల కింద రావాల్సిన నిధులివ్వకుండా కేంద్రం శీతకన్ను వేస్తోందని.. బయ్యారం ఉక్కు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఎన్‌డీసీ, ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఇవ్వడం లేదన్నారు. ఆదిలాబాద్ సీసీఐని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసిన కేటీఆర్.. ఎంఎస్‌ఎంఈలకు పెద్దఎత్తున ఆర్థిక ప్రోత్సాహకాలు కల్పించాలని కోరారు.
'తెలంగాణకు దక్కాల్సిన బయ్యారం స్టీల్ ప్లాంట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, నేషనల్ డిజైన్ సెంటర్, ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాల వరకు అనేక హామీలను కేంద్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్రం అడిగిన ఇండస్ట్రియల్ కారిడార్లతోపాటు డిఫెన్స్ కారిడార్ ఫార్మాసిటీ, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులకు అవసరమైన ఆర్థికసాయం వంటి అనేక అంశాలపై కేంద్రం స్పందించడం లేదు. తెలంగాణ అభివృద్ధి అంటే భారతదేశ అభివృద్ధి అనే విషయాన్ని కేంద్రం గుర్తించాలి. తెలంగాణ నుంచి వచ్చే సంపద దేశంలోని ఇతర వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి వినియోగం జరుగుతుండటం గర్వకారణం. అయితే రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం మరింతగా సహకారం అందించాలి. మేకిన్ ఇండియా నినాదం కేంద్ర ప్రభుత్వం మరిన్ని పారిశ్రామిక ప్రోత్సాహకాలతో పాటు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడే పరిపూర్ణమవుతుంది. దేశంలోని సూక్ష్మ, మధ్యతరహా పారిశ్రామిక రంగానికి ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి పెద్ద ఎత్తున ఆర్థిక ప్రోత్సాహకాలు కల్పించాలి.' అని సమావేశంలో కేటీఆర్ వెల్లడించారు.
జాతియస్థాయిలో చట్టం అవసరం: సాంకేతిక, సాఫ్ట్‌వేర్ రంగంలోని మార్పులను దేశం అందిపుచ్చుకోవాలని సమావేశంలో కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ- కామర్స్‌కి అనుబంధంగా ఉన్న ఆన్లైన్ మోసాలు, సైబర్ సెక్యూరిటీ, మొబైల్ పేమెంట్స్, అత్యుత్తమ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉండటం వంటి సంబంధిత అన్ని రంగాలపైనా విప్లవాత్మకమైన నిర్ణయాలను కేంద్రం ప్రకటించాలన్నారు. సైబర్ సెక్యూరిటీ, మొబైల్ పేమెంట్స్ వంటి అంశాలపై విధానాలు ప్రకటించాలన్న మంత్రి.. సిటిజన్ సర్వీస్ డెలివరీ పట్ల కేంద్రం చురుగ్గా కదలాలని సూచించారు. ఈ-కామర్స్ తరహా రంగాల ద్వారా భారీగా ఉద్యోగాల సృష్టి జరుగుతుందని.. ఈ రంగం పురోగతి దృష్ట్యా డిజిటల్ లిటరసీపై దృష్టిసారించాలన్నారు. సైబర్ నేరాల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం నల్సార్ వర్సిటీతో చట్టరూపకల్పన ప్రక్రియను ప్రారంభించిందని చెప్పారు. సైబర్ నేరాలకు సంబంధించి జాతీయ స్థాయిలో ఒక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: ఐటీఐ కళాశాలలో వేధిస్తోన్న అధ్యాపకుల కొరత.. విద్యార్థుల్లో ఆందోళన..!