కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని గడగడ వణికించిన విషయం అందరికి తెలిసిందే. ప్రజలంతా ప్రాణాలు గుప్పిట్లో పట్టుకుని జీవించారు. కరోనా రావడం ప్రజలకు ఇబ్బందిగా మారితే ఆ చేదు అవకాశాన్ని కొన్ని ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు సొమ్ము చేసుకోవాలని చూస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులపై అధిక ఫీజుల పేరుతో పిడుగులు వేస్తున్నాయి. ఆన్లైన్ తరగతుల పేరిట ల్యాప్టాప్లు, మొబైల్స్ వంటివి కొనాలని... మొండికేయడం వల్ల కొందరు అప్పులు చేసి మరీ కొనిచ్చారు. అంత చేసినా... అవి విద్యార్థులకు ఏదైనా ఉపయోగపడ్డాయా అంటే అదీ లేదు.. ఖర్చు తప్ప..!
ఆ తర్వాత పాఠశాలలు మొదలు కాగా... మూడు, నాలుగు నెలలు చెప్పిన క్లాసులకు మొత్తం ఫీజు చెల్లించమని ఆ పాఠశాలల నుంచి ఫోన్లు, తల్లిదండ్రులు పాఠశాలలకు రావాలని పిలుపులు. ప్రభుత్వం ఎంత చెప్పినా... సామాన్యుల కష్టాలను పాఠశాలల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు, యువ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కరోనా సమయంలో ఉన్న ఫీజులు మొత్తం తీసుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అంత గిట్టుబాటు కాకుంటే విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చలు జరిపి ఫీజు తగ్గించాలని పేర్కొన్నారు. ఫీజుల విషయంలో ఇంకొన్ని ప్రాణాలు పోకముందే ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుని ప్రజలకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.