పారసెట్మాల్ ధరలు ప్రస్తుతం ఆకాశాన్నంటాయి. రెండు- మూడు నెలల వ్యవధిలోనే 70 - 80 శాతం మేరకు ధర పెరిగిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఒక పక్క కొవిడ్-19 రెండోదశ ముప్పు పెరుగుతుండగా, ఈ చికిత్సలోనూ వినియోగించే పార్మాసెట్మాల్ ధర పెరగటంపై ఔషధ పరిశ్రమ, వైద్య వర్గాలు ఆందోళన వెలిబుచ్చుతున్నాయి.
కిలో రూ.700కు చేరిక
పారాసెట్మాల్ ధర పెరగడానికి ప్రధాన కారణం ముడిపదార్థాల కొరతేనని తెలుస్తోంది. ఈ ఔషధం తయారీలో పారా అమినో ఫెనాల్ (పీఏపీ), అసిటిక్ హైడ్రేట్ లను ప్రధాన ముడిపదార్థాలుగా వినియోగిస్తారు. పారాసెట్మాల్ ఔషధ తయారీలో 70 శాతం వరకు పీఏపీ కావాలి. కొరత వల్ల పీఏపీ ధర ఇటీవల 70 శాతం పెరిగింది. కిలో పీఏపీ ధర రూ.290 నుంచి రూ.500 వరకూ పెరిగింది. అసిటిక్ హైడ్రేట్ ధర కూడా దాదాపు రెట్టింపు అయ్యింది. దీంతో పారాసెట్మాల్ ధరకు రెక్కలు వచ్చాయి. కిలో పారాసెట్మాల్ ధర ఇటీవలి వరకు రూ.350- 400 ఉండగా, ఇప్పుడు అది రూ.700 వరకు పలుకుతోంది.
ఈ ఔషధం తయారీకి అవసరమైన ముడిపదార్థాల కోసం మనదేశం చైనా మీద అధికంగా ఆధారపడుతోంది. చైనా నుంచి పీఏపీ, అసిటిక్ హైడ్రేట్‌లను మన ఔషధ కంపెనీలు దిగుమతి చేసుకుని పారాసెట్మాల్ ఔషధాన్ని తయారు చేస్తున్నాయి. చైనాలో పీఏపీ అధికంగా తయారు చేసే అతిపెద్ద కంపెనీ ఒకటి మూతబడటం వల్ల 2-3 నెలలుగా పీఏపీ దిగుమతులు తగ్గిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా పీఏపీ తయారీ సామర్థ్యంలో దాదాపు 50 శాతం ఈ చైనా కంపెనీకే ఉంది. ఆ కంపెనీ నుంచి సరఫరాలు నిలిచిపోవడంతో పీఏపీకి తీవ్రమైన కొరత ఏర్పడింది. దీంతో దేశీయ ఔషధ కంపెనీ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నాయి.
దేశీయంగా తయారీ కంపెనీలు
మనదేశంలో పారాసెట్మాల్ ఏపీఐ (యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రేడియంట్) ని అధికంగా తయారు చేసే ఫార్మా కంపెనీల్లో గ్రాన్యూల్స్ ఇండియా, శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్, ఫార్మ్‌సన్ ఫార్మాస్యూటికల్స్, భారత్ కెమికల్స్, పారా ప్రోడక్ట్స్.. తదితర కంపెనీలు ఉన్నాయి. ఇందులో గ్రాన్యూల్‌్ ఇండియా, శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పారాసెట్మాల్ తయారీ సామర్థ్యం గ్రాన్యూల్స్ ఇండియాకు ఎంతో అధికం. ఈ కంపెనీ ప్రస్తుతం ముడిపదార్థాలను ఇతర మార్గాల్లో సమకూర్చుకుంటున్నట్లు తెలిసింది.
గత ఏడాది కొవిడ్-19 వ్యాప్తి మొదలైనప్పుడు దేశీయంగా పారాసెట్మాల్ మందుకు కొరత రాకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా దీని ఎగుమతులను నిషేధించడం విదితమే. ఆ తర్వాత కొంతకాలానికి నిషేధాన్ని ఎత్తివేసింది.
ధరలు పెంచలేదు
ప్రస్తుత పరిస్థితుల్లో పెరిగిన పారాసెట్మాల్ ధరను కంపెనీలు ఇంకా వినియోగదార్లకు బదిలీ చేయలేదని తెలుస్తోంది. అందువల్ల ఈ మందు రిటైల్ ధరల్లో మార్పు రాలేదు. దీర్ఘకాలం పాటు ప్రస్తుత పరిస్థితి కొనసాగితే పారాసెట్మాల్ రిటైల్ ధరా పెరగొచ్చు. ముడిపదార్థాల అధిక ధరను ఔషధ కంపెనీలు వినియోగదార్లకు బదిలీ చేసేందుకు సిద్ధపడతాయని స్థానిక ఔషధ పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
- ఇదీ చదవండి : ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించటంలో అదే వైఫల్యం