Seed Prices Hike: అన్నదాతలను విత్తన ధరలు భయపెడుతున్నాయి. వానాకాలం(ఖరీఫ్) సీజన్‌కు వచ్చే నెల మొదటివారం నుంచి విక్రయించే పలురకాల విత్తనాల రేట్లు భారీగా పెరుగుతున్నాయి. పత్తి తరవాత అరకోటి ఎకరాలకు పైగా సాగయ్యే వరి విత్తనాల గరిష్ఠ ధర క్వింటాకు రూ.4,400కి చేరింది. ఒక్కో బ్రాండును బట్టి రూ.3,200 నుంచి రూ. 4,400 వరకు రేట్లను కంపెనీలు నిర్ణయించాయి. ఏ గ్రేడ్ ధాన్యం ధర క్వింటాకు రూ.1960 ఇవ్వాలని కేంద్రం 2021 జూన్‌లో ప్రకటించింది.
వరి క్వింటా విత్తనాల ధరలో కనీసం సగానికి సగమైనా రైతు పండించే ధాన్యానికి లేదు. విత్తన పంట సాగు ఖర్చులు బాగా పెరిగినందున ధరలు పెంచుతున్నట్లు ప్రైవేటు కంపెనీలు చెబుతున్నాయి. ఇంకా మొక్కజొన్న, సోయాచిక్కుడు వంటి పంటల విత్తనాల రేట్లు రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. మొక్కజొన్న పంటలో మాధురి, బీపీసీహెచ్-6 అనే పేరుగల వంగడాలైతే క్వింటా ధర ఏకంగా రూ.40 వేలు పలుకుతోంది. వీటిని ఎకరానికి 8 కిలోలే వేస్తారని, రైతులపై భారం ఉండదని కంపెనీలు చెబుతున్నాయి.
24న మేళాలు : పరిశోధనల ద్వారా పండించిన నాణ్యమైన విత్తనాలను విక్రయించే ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తాజాగా ధరలు ఖరారు చేసింది. ఈ నెల 24న రాజేంద్రనగర్, జగిత్యాల జిల్లా పొలాస, పాలెం(నాగర్‌కర్నూల్ జిల్లా), తోర్నాల(సిద్దిపేట), నత్నాయిపల్లి, ఆదిలాబాద్, మల్యాల, తాండూరు, ముథోల్, వరంగల్ విశ్వవిద్యాలయ ప్రాంతీయ పరిశోధన కేంద్రాల్లో ఈ విత్తనాలను రైతులకు నేరుగా విక్రయించేందుకు ‘విత్తన మేళా’లు ఏర్పాటు చేస్తున్నట్లు వర్సిటీ వెల్లడించింది. 8 రకాల పంటలకు సంబంధించిన 44 రకాల మేలైన వంగడాలు 15 వేల క్వింటాళ్లను రైతులకు అమ్మనున్నట్లు జయశంకర్ ఉపకులపతి(వీసీ) ప్రవీణ్‌రావు చెప్పారు.
ఇవీ చదవండి: ప్రధాని పర్యటనకు ఈసారీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరం
బంగాళాఖాతంలో నైరుతి ఋతుపవనాలు... రాష్ట్రంలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు