సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో యూజీలోని అన్ని కోర్సులలో చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులకు పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 15 నుంచి దశల వారీగా పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కోర్సుల వారీగా పరీక్షల షెడ్యూల్‌ను ఓయూ పరీక్షల విభాగం నియంత్రణాధికారి ప్రొ.శ్రీరామ్ వెంకటేశ్ విడుదల చేశారు. పరీక్షలను కొవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వర్సిటీ పరిధిలో చివరి ఏడాదిలో 1.10 లక్షల మంది విద్యార్థులుండగా.. 65 వేల మంది డిగ్రీ కోర్సుల వారు కాగా.. 20 వేల మంది సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులు చదువుతున్నారు. మరో 25వేల మంది పీజీ కోర్సులు చేస్తున్నారు.
పీజీ పరీక్షల ఫీజు చెల్లింపునకు ఉస్మానియా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎమ్మెస్‌డబ్ల్యూ పరీక్షలకు ఈ నెల 14వరకు ఫీజు చెల్లించాలని యూనివర్సిటీ తెలిపింది. ఆలస్య రుసుముతో ఈ నెల 19 వరకు చెల్లించవచ్చునని పేర్కొంది.
షెడ్యూల్ ఇలా...
- ఈ నెల 15 నుంచి ఇంజినీరింగ్, ఫార్మసీ, హోటల్ మేనేజ్‌మెంట్, బీసీఏ, బీఈడీ, ఎల్‌ఎల్‌బీ-3, 5వైడీసీ, ఎల్‌ఎల్‌ఎం, బీపీఈడీ కోర్సులకు ప్రారంభం కానున్నాయి.
- ఈ నెల 22 నుంచి డిగ్రీలోని బీఎస్సీ, బీఏ, బీకాం, బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ కోర్సులకు పరీక్షలు మొదలు కానున్నాయి. దూరవిద్య పరీక్షలు అదే నుంచి ప్రారంభమవుతాయి. చివరిగా బీఏ కోర్సుల పరీక్షలు వచ్చే నెల 19తో ముగియనున్నాయి. పరీక్షలు ఉదయం, సాయంత్రం రోజూ రెండు షిఫ్టుల్లో జరగనున్నాయి. ఉదయం 10 నుంచి 12 వరకు బీకాం, మధ్యాహ్నం 3 నుంచి 5 మధ్య మిగిలిన కోర్సుల విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి.
ఇదీ చూడండి: ఎల్ఆర్ఎస్ పథకానికి ఆదరణ.. 96 లక్షల వరకు ఆదాయం