రోడ్డు ప్రమాదంలో తాను మరణించినా.. 8 మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించాడు 21ఏళ్ల విస్లావత్ కుమార్. గత నెల 18న ద్విచక్రవాహనం పైనుంచి పడి గాయపడిన కుమార్ నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జీవన్మృతుడు (బ్రెయిన్ డెడ్) అయ్యాడు. విషయం తెలుసుకున్న జీవన్‌దాన్ ప్రతినిధులు అతని కుటుంబాన్ని ఒప్పించి అవయవదానం చేయించారు. అతడి నుంచి సేకరించిన గుండె, కిడ్నీలు, కాలేయం, నేత్రాలు, ఊపిరితిత్తులు.. ఇప్పుడు 8 మందికి కొత్త జీవితాన్ని ఇచ్చాయి.
గత నెలలోనే నగరానికి చెందిన ఓ వ్యక్తి ప్రాణాన్ని 560 కి.మీల దూరంలో జీవన్మృతుడైన ఓ వ్యక్తి కాపాడాడు. ఇక్కడి ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న వ్యక్తి వాటి మార్పిడి కోసం జీవన్‌ధాన్‌లో పేరు నమోదు చేసుకున్నారు. పుణెలో ఇదే సమయానికి మరో వ్యక్తి జీవన్మృతుడు కావడంతో ఆయన కుటుంబసభ్యుల ఆమోదంతో ప్రత్యేక విమానంలో కేవలం గంట వ్యవధిలో ఊపిరితిత్తుల్ని నగరానికి తీసుకొచ్చి ఇక్కడి బాధితుడికి ప్రాణం పోశారు వైద్యులు.
కళ్లు తెరిస్తే జననం.. కళ్లు మూస్తే మరణం.. ఈ రెండింటి మధ్య నడిచేదే మనిషి జీవితం. పుట్టడం, గిట్టడం ఏ ఒక్కరి చేతిలో ఉండేవి కావు. కానీ.. చనిపోయాక కూడా జీవించి ఉండటం మాత్రం మన చేతిలోనే ఉంది. అవును.. ఇప్పుడు ఇదే ‘జీవన్‌దాన్’ కార్యక్రమం నినాదం.
ఒకరికి గుండె, ఇంకొకరికి ఊపిరితిత్తులు, మరొకరికి కళ్లు.. ఇలా అవయవాల కోసం ఎదురుచూస్తున్న వారు లక్షల్లో. నిత్యం మరణిస్తున్న వారూ లక్షల్లోనే ఉన్నారు. ఇందులో దాదాపు 95% అవయవాలు మట్టిలోకి చేరిపోతున్నవే. ఆ వృథాను ఆపేందుకు విశేషంగా కృషి చేస్తోంది జీవన్‌దాన్ సంస్థ. అటు జీవన్మృతుల కుటుంబాల్లో అవగాహన కల్పిస్తూ.. ఇటు బాధితుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది ఈ బృందం. కొవిడ్-19 కారణంగా పూర్తిగా ఆగిపోయిన దాతల సంఖ్య గత నెల నుంచి కొద్దికొద్దిగా పెరుగుతూ వస్తోంది. సెప్టెంబర్‌లోనే 8మంది జీవన్మృతులు 39మందికి కొత్త జీవితాన్నిచ్చారు.
ప్రత్యేక అవయవ మార్పిడి కేంద్రం..!
రాష్ట్రంలో కిడ్నీ, లివర్ రోగుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ అవయవ మార్పిడికి డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం నిమ్స్, గాంధీ, ఉస్మానియాలో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్నారు. అయితే.. దాతల సంఖ్య తక్కువగా ఉండటంతో చాలామంది రోగులు ఎదురుచూస్తూనే కన్నుమూస్తున్నారు. ప్రమాదాల్లో రోజూ బ్రెయిన్ డెడ్ జరుగుతున్నా వాటిని గుర్తించడంలో, కుటుంబాల్ని ఒప్పించడంలో అంతరాయం ఏర్పడుతుంది. దీంతో చాలా అవయవాలు వృథా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ పద్దతికి సడలింపులివ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు నిమ్స్‌లోనే ప్రత్యేక మార్పిడి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఆరోగ్యశాఖ, జీవన్‌దాన్ అధికారులు ప్రతిపాదనలు తయారుచేశారు.
విస్తృత అవగాహన కల్పిస్తున్నాం..
ఇప్పటికే నగరవాసుల్లో చాలావరకు అవయవదానంపై అవగాహన వచ్చింది. అందుకే ముందస్తుగా ఆన్‌లైన్, ఇతర వేదికలుగా జీవనదాన్‌లో పేరు నమోదు చేసుకుంటున్నారు. కొవిడ్-19 తర్వాత ఇప్పుడిప్పుడే దాతల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ సహకారంతో అవయవమార్పిడికి కృషి చేస్తున్నాం. జనంలోకి మరింత విస్తృతంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం.
- డాక్టర్ స్వర్ణలత, జీవన్‌దాన్ ఇన్‌ఛార్జి