ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో.. అత్యాచార బాధిత యువతిని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అత్యాచారానికి పాల్పడిన వారికి వైకాపా నేతలు అండగా నిలిచి.. కేసు మాఫీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు తెదేపా పోరాడుతుందన్నారు. వైకాపా పాలనలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడుల్ని నియంత్రించడంలో ముఖ్యమంత్రి ఘోరంగా విఫలమయ్యారని రవీంద్ర ఆరోపించారు.
మరోవైపు.. మచిలీపట్నంలో అత్యాచారానికి గురైన బాధితురాలిని పరామర్శించేందుకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన తెదేపా, భాజపా మహిళా నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, మహిళా నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ ఆస్పత్రి వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు.
పోలీసుల తీరును భాజపా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు బొల్లిన నిర్మల కిశోర్, ఉపాధ్యక్షురాలు మాలతీ రాణి ఖండించారు. బాధిత మహిళను పరామర్శించేందుకు వచ్చిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించిపోయాయని ధ్వజమెత్తారు.
ఇదీ చూడండి: ప్రియుడిని చెట్టుకు కట్టేసి యువతిపై మందుబాబుల అత్యాచారం