anakapalli: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో గల్లంతైన యువకుల మృతదేహాలను నేవీ సిబ్బంది గుర్తించారు. రెండు హెలికాప్టర్లతో తీరం వద్ద గాలింపు చేపట్టగా.. ఆరుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. నీటిపై తేలియాడుతున్న మృతదేహాలను హెలికాప్టర్ ద్వారా ఒడ్డుకు చేర్చారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. నేవీ హెలికాప్టర్, నాలుగు బోట్లతో కోస్ట్ గార్డులు, మెరైన్ పోలీసులు మత్స్యకారుల సహాయంతో తీరంలో గాలించగా.. మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన పవన్ సూర్యకుమార్ (గుడివాడ) గణేశ్(మునగపాక), జగదీశ్(గోపాలపట్నం), రామచందు(ఎలమంచిలి), విద్యార్థి సతీశ్(గుంటూరు), జశ్వంత్(నర్సీపట్నం)గా పోలీసులు గుర్తించారు.
అంతకుముందు తెదేపాకు చెందిన ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు బృందం ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్న అనకాపల్లి జిల్లా సంయుక్త కలెక్టర్ కల్పనాకుమారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారం ప్రకటించాలని కోరారు. ప్రమాద ఘటనపై చుట్టు పక్కల గ్రామాలకు తెలియడంతో ప్రజలు తీరానికి భారీగా తరలివెళ్తున్నారు.
ఇదీ జరిగింది: అనకాపల్లి జిల్లా పూడిమడక సముద్రతీరంలో శుక్రవారం డైట్ కళాశాలకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు మొత్తం 12 మంది పరీక్షలు ముగిసిన తర్వాత విహారం కోసం పూడిమడక బీచ్‌కు వచ్చారు. 12 మందిలో ఒకరు ఒడ్డు మీద కూర్చుని ఉండగా.. 11 మంది సముద్రంలోకి స్నానానికి దిగారు. కాసేపటికి లోపలికి దిగిన విద్యార్థులపైకి ఓ రాకాసి అల వచ్చి పడింది. దీంతో వారు లోపలికి వెళ్లారు. కాసేపటికే నలుగురు తిరిగి తీరానికి కొట్టుకొచ్చారు. ఏడుగురు మాత్రం బయటికి రాలేకపోయారు. ఒడ్డు మీద ఉన్న విద్యార్థితో పాటు బయటికి వచ్చిన వారు పెద్దగా అరవడంతో దగ్గర్లో ఉన్న స్థానికులు ఇద్దరిని బయటికి తీసుకొచ్చారు.
ఘటన జరిగిన వెంటనే స్థానికులు, మత్స్యకారులు గాలింపు చేపట్టారు. సమాచారం తెలుసుకున్న కలెక్టర్, ఎస్పీ ఆ ప్రాంతానికి వచ్చి గాలింపును పర్యవేక్షించారు. మంత్రి అమర్నాథ్ కూడా సహాయచర్యలను పరిశీలించారు. విద్యార్థుల ఆచూకీ కోసం సాధ్యమైనంత మేర ప్రయత్నిస్తున్నామని ఎస్పీ తెలిపారు. గల్లంతైన సమాచారం తెలుసుకుని పూడిమడక వచ్చిన విద్యార్థుల కుటుంబసభ్యులకు.. అభిజిత్ పరిశ్రమ అతిథి గృహంలో వసతి, భోజనం ఏర్పాటు చేశారు. ఈ విషాద ఘటనపై ఏపీ సీఎం జగన్ ఆరా తీశారు. విద్యార్థుల గల్లంతుపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.