జూనియర్ వైద్యులు ఆందోళన ఉద్ధృతం
జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణలో జూనియర్ వైద్యులు ఆందోళన ఉద్ధృతం చేశారు. బిల్లులోని అభ్యంతరకర అంశాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. గత మూడు రోజులుగా ఓపీ, ముందస్తు ఎంపిక చేసుకున్న శస్త్రచికిత్సలను బహిష్కరించిన జూడాలు అత్యవసర సేవల్లోనూ పాల్గోబోమని వెల్లడించారు. ఉస్మానియా, గాంధీ, ఎంజీఎం ఆసుపత్రుల్లో నిన్న సాయంత్రం నుంచే అత్యవసర సేవలను బహిష్కరించారు.
అత్యవసర సేవల బహిష్కరణ
ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో అత్యవసర సేవలనూ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తమ ఆందోళనకు స్పందన రాకపోవడంతో సమ్మెను తీవ్రతరం చేయడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూడాల ప్రతినిధులందరూ కలిసి గాంధీ ఆసుపత్రి ఆవరణలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. డిమాండ్లను సాధించే వరకు దీక్షను కొనసాగిస్తామని, అఖిల భారత స్థాయిలో ఐఎంఏ, జూడాల నేతలతో సంప్రదించి ఇవాళ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.