OTS Scheme : వివాదం కారణంగా చెల్లించని పన్ను బకాయిలను కట్టేందుకు ప్రజలకు ‘వన్‌టైం సెటిల్‌మెంట్ పథకం’(ఓటీఎస్) ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం.. ఎలాంటి వివాదం లేని పన్నులను వంద శాతం చెల్లించాలి. ఏపీజీఎస్టీ కింద 2005 వరకూ చెల్లించాల్సిన పన్నుపై వివాదం ఏర్పడి నిలిచిపోయి ఉంటే ఇప్పుడు ఆ సొమ్ములో 40 శాతం కడితే చాలు. మిగిలిన 60 శాతం రద్దు చేస్తారు.
వ్యాట్, జీఎస్టీ కింద వివాదం ఏర్పడి పన్ను బకాయిలుంటే మొత్తం సొమ్ములో 50 శాతం కడితే చాలు. మిగిలినదాన్ని రద్దు చేస్తారు. సరకు వాహనాల ఎంట్రీ ట్యాక్స్ కింద ఉన్న వివాదాస్పద పన్ను బకాయిల్లో 60 శాతం కడితే మిగిలిన 40 శాతం రద్దు చేస్తారు. ఈ పథకాన్ని వినియోగించుకున్నవారికి పన్నులపై వడ్డీలు, జరిమానాలను రద్దు చేస్తారు. ఓటీఎస్ కింద ఒకసారి చెల్లించిన సొమ్మును తిరిగివ్వరని వాణిజ్య పన్నుల శాఖ స్పష్టం చేసింది.