OMR Sheets in Online : ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో మరింత పారదర్శకత కోసం అభ్యర్థులు జవాబులు నమోదు చేసిన ఒరిజినల్ ఓఎంఆర్ పత్రాలను ఆన్‌లైన్‌లో పెట్టాలని నియామక సంస్థలు నిర్ణయించాయి. గతంలో కొన్ని పోస్టుల భర్తీ సందర్భంలో ఈ ప్రయత్నం చేసినప్పటికీ... ఈసారి 80వేల ఉద్యోగాల భర్తీకి నిర్వహించే అన్నిరకాల పరీక్షలకు తప్పనిసరి చేయనున్నాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ సహా గ్రూప్-2, 3, 4తో పాటు ఇతర నియామక సంస్థలు నిర్వహించే పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తాము పేర్కొన్న సమాధానాలు ఎన్ని సరైనవో ఆన్‌లైన్‌లో పెట్టే ఒరిజినల్ ఓఎంఆర్ చూసి తెలుసుకునేందుకు వీలు కలుగనుంది.
పోటీ పరీక్షల్లో మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో ప్రశ్నలకు సమాధానాలను ఓఎంఆర్ షీట్లలో గుర్తించాలి. ఇప్పటివరకు ఒరిజినల్ షీటుకు అనుసంధానంగా కార్బన్‌తో కూడిన నకలు కాపీ ఉంది. అభ్యర్థులు గుర్తించిన సమాధానాలు కార్బన్ కారణంగా నకలు కాపీపై నమోదయ్యేవి. ఇన్విజిలేటర్లు ఒరిజినల్ ఓఎంఆర్ షీటును మూల్యాంకనానికి తీసుకుని, కార్బన్ షీటును అభ్యర్థికి ఇచ్చేవారు. పరీక్ష ప్రాథమిక కీ విడుదలైన తరువాత సమాధానాలు, పరీక్షలో నమోదు చేసిన సమాధానాలతో పోల్చుకుని మార్కులపై అంచనాకు వచ్చేవారు. అయితే కొందరు కార్బన్ సరిగా ఉంచకపోవడం, పక్కకు జరగడం కారణంగా ఒరిజినల్ ఓఎంఆర్‌లో సమాధానం ఏ గా నమోదు చేస్తే.. నకలు కాపీలో బీ లేదా సీ గా నమోదయ్యేది. సమాధానాలు గజిబిజిగా వచ్చేవి. దీంతో కీ విడుదల చేసినపుడు కొందరు అభ్యర్థుల్లో మార్కుల అంచనాపై గందరగోళం ఏర్పడేది. ఈ అడ్డంకులను అధిగమించేందుకు అభ్యర్థుల ఒరిజినల్ ఓఎంఆర్ షీట్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని టీఎస్‌పీఎస్సీతో సహా నియామక సంస్థలు నిర్ణయించాయి. దీంతో పరీక్షల్లో అభ్యర్థులు సాధించే మార్కులపై స్పష్టత వస్తుందని అంచనా వేస్తున్నాయి.
ఇవీ చదవండి :