పాతబస్తీ పరిధిలోని పలు కాలనీలు ప్రజలు ఇంకా వరద ముంపు నుంచి తేరుకోలేదు. విరుచుకుపడ్డ జల విపత్తుతో ఇంట్లో నిత్యావసరాలు సహా విలువైన సామాన్లు కొట్టుకుపోయాయని ఆవేదన చెందుతున్నారు. ఆస్తినష్టంతో కోలుకోలేని దెబ్బపడిందని వాపోయారు. స్థానికులు వరదల్లో పోయిన సామాగ్రిని వెతుక్కునే పనిలో ఉన్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత జనం కోరుతున్నారు.
కంటిమీద కునుకు లేకుండా..
సమీప కాలనీల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న జీడిమెట్ల ఫాక్స్ చెరువు ప్రవాహ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. 56 బస్తీల జనం ముంపు బారిన పడ్డారని పురపాలక పరిపాలన కమిషనర్ సత్యనారాయణ వెల్లడించారు. బాధిత కాలనీల్లో పర్యటించిన ఆయన.. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న బస్తీల ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. వరద తగ్గిన ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా రసాయనాలు పిచికారీ చేయాలని ఆయా మున్సిపల్ కమిషనర్లను ఆదేశించినట్లు సత్యనారాయణ వెల్లడించారు.
మూసీ ఉగ్రరూపం..
ఉగ్రరూపం దాల్చిన మూసీ నది వరద ఉద్ధృతికి పాతబస్తీ పురానాపూల్ వంతెనకు పగుళ్లు ఏర్పడ్డాయి. పురాతనమైనది కావడం వల్ల ముందుజాగ్రత్తగా వంతెనను మూసేసిన అధికారులు అప్రమత్తమై వాహనాల రాకపోకలు వేరే ప్రాంతాల నుంచి మళ్లించారు. ప్రజలు సైతం యంత్రాంగానికి సహకరించాలని కోరారు. భారీ వర్షాలు, వరదల దృష్ట్యా ప్రజలెవరూ బయటికి వెళ్లొద్దంటూ బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో మున్సిపల్ సిబ్బంది మైకు ద్వారా ప్రచారం చేశారు.
చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలోని అల్‌జుబైల్ కాలనీలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వరదల్లో గల్లంతైన వ్యక్తి నీటిలో తేలియాడి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు శవపరీక్ష కోసం ఉస్మానియా ఆసుపత్రి శవాగారానికి తరలించారు.
ఇవీ చూడండి: గ్రేటర్ పరిధిలోనే 33 మంది మృతి: కేటీఆర్