హైదరాబాద్ మహానగరంలో కొవిడ్19 కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. వైద్యపరీక్షలు చేయించుకుంటున్న వారిలో కేవలం 3-5శాతం మందికి మాత్రమే పాజిటివ్ లక్షణాలు బయటపడుతున్నాయి. కొందరు రోజుల తరబడి వదలని జ్వరంతో ఇబ్బంది పడుతూ ఇల్లొదిలి వెళ్లిపోతున్నారు. స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్‌చేసి సహాయం కోరుతున్న వారి శాతం నాలుగు నెలల వ్యవధిలో 20 నుంచి 45శాతం పెరగటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మహిళలు, వృద్ధులు ఎక్కువశాతం ఆందోళనకు గురవుతున్నారు. తమ అనారోగ్యం కారణంగా కుటుంబ సభ్యులకు ఇబ్బందులు వస్తాయని క్షణికావేశంలో ఉసురు తీసుకుంటున్నారు. నార్సింగి ఠాణా పరిధిలో ఓ గృహిణి ఒంటరితనం వల్లే తాను అఘాయిత్యానికి పాల్పడుతున్నట్టు సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నారు.
మాట కరవై.. మనసు భారమై
కరోనా లాక్‌డౌన్ సమయంలో రోజు 100కు పైగా వచ్చే ఫోన్‌కాల్స్‌లో 70శాతం కేవలం ఒంటరితనం, కరోనా భయాలతో నిద్రకు దూరమవుతున్నామంటూ ఆందోళన వెలిబుచ్చారని రోష్నీ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆ సమయంలో మాట సాయంతో వారిలో ఆత్మస్థైర్యం నింపటం ద్వారా ప్రతికూల ఆలోచనలకు అడ్డుకట్ట వేశామని వివరించారు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కొవిడ్ 19 గురించి పదేపదే భయాందోళనలు వ్యక్తం చేస్తున్నవారికి అవగాహన కల్పించాలని మనస్తత్వ విశ్లేషకులు డాక్టర్ మోతుకూరి రాంచందర్ సూచించారు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వదంతులకు దూరంగా ఉంచాలన్నారు.
ఇవీ చూడండి: నిధులు విడుదల కాక ఇబ్బందుల్లో చేనేత కార్మికులు