బెంగళూరు కేంద్రంగా కొద్ది నెలలుగా ఓ మైగాడ్ అనే యాప్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈ యాప్‌లో వచ్చే ప్రకటనలు క్లిక్ చేస్తే చాలు ఆదాయం పొందొచ్చని యువతకు వల వేస్తున్నారు. ఈ మాటలు నమ్మిన బాధితులు రూ.లక్షల్లో నష్టపోతున్నారు. వీటిపై పది రోజుల్లో 15 కేసులు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.
ఓఎంజీ బర్స్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే.. బాధితుల పేరుతో ఓ ఖాతా ప్రారంభమవుతుంది. రూ.500, రూ.1000, రూ.10 వేలు ఇలా.. ధరావతు చేయగానే. అందులోని బహుళజాతి సంస్థల ప్రకటనలు కనిపిస్తాయి. ఆ ప్రకటనలపై క్లిక్ చేస్తే.. పాయింట్లు బాధితుడి ఖాతాలో జమవుతాయి. ఒక్కో పాయింట్‌కు రూ.2 చొప్పున ఇస్తారు. బాధితులు సంపాదించిన పాయింట్లకు 24 గంటల్లో నగదు బదిలీ చేస్తారు. 50 రోజుల్లో రూ.లక్ష ఆదాయం వస్తుంది.. ధరావతు భద్రంగా ఉంటుందన్న భావనతో వేలమంది యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఓఎంజీ బర్స్ యాప్ నిర్వాహకులు, రుణాల యాప్‌ల సృష్టికర్తలు జెన్నీఫర్, ల్యాంబో, నాగరాజు కంపెనీలతో సంబంధాలున్నాయని హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. బ్యాంకుల నుంచి అధికారిక సమచారం రాగానే నిర్వాహకులపై చర్యలు చేపట్టనున్నామని వివరించారు.
- ఇదీ చూడండి : కొలువుల పేరుతో యువతకు వల