పోలవరం నిర్వాసితులను అధికారులు గాలికొదిలేశారు. వారికి పరిహారం ఇవ్వాలన్న విషయం పట్టించుకోకుండా గ్రామాలు ఖాళీ చేయమంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముంపు గ్రామాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. రైతులు తమ పొలాల్లో సాగు చేయకుండా అధికారులు అడ్డుకుంటున్నారు. కొన్నిచోట్ల సాగు చేసిన పంట గోదావరి వరదకు మునిగిపోతోంది. మూడేళ్లుగా నష్టపోయిన రైతులు.. ఆ భయంతో ఈసారి సాగు జోలికి పోలేదు. వ్యవసాయం చేసేందుకు పొలాలు లేక, ఉపాధి పనులు దొరక్క పొట్టచేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 3 9ముంపు గ్రామాలను గుర్తించారు. ఆయా గ్రామాల్లోని 30 వేల కుటుంబాలకు పునరావాస కార్యక్రమాలు చేపట్టారు. వారికి అవసరమైన ఇళ్ల నిర్మాణం, భూ పరిహారం, పునరావాస ప్యాకేజీ అందిచాల్సి ఉంది. ఈ జాబితాలను మూడేళ్ల కిందటే సిద్ధం చేసినా.. ఇప్పటికీ ఏ పరిహారమూ అందలేదు. 14 వేల ఎకరాలకు గానూ కేవలం 13వందల ఎకరాలకు పరిహారమిచ్చి చేతులు దులిపేసుకున్నారని బాధితులు వాపోతున్నారు.
ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో రైతులు ఒకప్పుడు అన్నిరకాల పంటలు పండించేవారు. వరి, అపరాలు, మిరప, కంది, పత్తి, కొబ్బరి, మామిడి లాంటివి పండించేవారు. సారవంతమైన నేలలు కావడం వల్ల అధిక దిగుబడులు వచ్చేవి. కాఫర్ డ్యామ్ నిర్మాణంతో వ్యవసాయ పనులు నిలిచిపోయాయి. చిన్న వరదకే గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఒకవేళ సాగు చేసినా... గోదావరి వరద పొలాలను ముంచేస్తోంది. పంట నష్టపోయి, పెట్టుబడి రాని పరిస్థితిని రైతులు ఎదుర్కొన్నారు. దీనివల్ల సాగు చేయడమే మానేశారు. ప్రాజెక్టు కోసం అన్నీ వదులుకున్న తమకు పరిహారం, పునరావాసం అందకపోవడంపై నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు.