RAIDS IN CINEMA THEATERS : ఆంధ్రప్రదేశ్లో పలుప్రాంతాల్లోని సినిమా థియేటర్లలో అధికారులు తనిఖీలు చేశారు. అనంతపురంలో జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ సినిమా హాళ్లను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు తినుబండారాలు, టికెట్ విక్రయాలు చేపట్టాలని యజమానులకు సూచించారు. సక్రమంగా రికార్డులు నిర్వహించాలని యాజమాన్యాలను ఆదేశించారు. టికెట్ల ధరలను బోర్డులపై ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త చిత్రాల విడుదల సమయంలో అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టికెట్ ధరలు గిట్టుబాటు కావట్లేదని పెనుగొండలో రెండు సినిమా థియేటర్లను యజమానులు మూసివేశారు.
లైసెన్స్ లేని థియేటర్ల మూసివేత..
చిత్తూరు జిల్లా కుప్పంలో లైసెన్స్లు లేని నాలుగు సినిమా హాళ్లను అధికారులు మూసివేశారు. మదనపల్లెలో లైసెన్స్ రెన్యువల్ చేసుకోని థియేటర్లపై అధికారులు చర్యలు తీసుకున్నారు. 7 థియేటర్లలోని సినిమాలు నిలిపివేస్తున్నట్లు సబ్ కలెక్టర్ ప్రకటించారు. లైసెన్స్ రెన్యువల్ చేసుకున్నాకే థియేటర్లు ప్రారంభించుకోవాలని సూచించారు.
థియేటర్లలో వసతుల పరిశీలన..
గుంటూరులోని థియేటర్లలో జేసీ దినేశ్ కుమార్ తనిఖీ నిర్వహించారు. హాలీవుడ్, బాలీవుడ్, లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్‌లో సోదాలు చేశారు. థియేటర్లలో వసతులను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలు అమలు చేయాలని యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు.
స్వచ్ఛందంగా మూసివేత..
ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలను తగ్గించడంతో సినిమా థియేటర్లను నడపడం తమవల్ల కాదంటూ... యజమానులే వాటిని స్వచ్ఛందంగా మూసివేస్తున్నారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీల పరిధిలో నడిచే థియేటర్ల విషయంలో ఈ పరిస్థితి నెలకొంది. కొవిడ్ నుంచి బయటపడే తరుణంలో సర్కారు టికెట్ల ధరలు తగ్గించేయడంతో ఆర్థిక భారాన్ని మోయలేక... తూర్పుగోదావరి జిల్లాలో 45 మంది యజమానులు గురువారం థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేశారు. అనంతపురం జిల్లా పెనుకొండ, కృష్ణా జిల్లా నందిగామ, మైలవరం, పెనుగంచిప్రోలు, శ్రీకాకుళం జిల్లా కొత్తూర్లలో తమ థియేటర్లకు యజమానులే స్వయంగా తాళాలు వేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి సినిమా థియేటర్లలో అధికారుల తనిఖీలు మొదలయ్యాయి. ఈ క్రమంలో రాజమహేంద్రవరం గ్రామీణంలోని నామవరం, ధవళేశ్వరం... కాకినాడ గ్రామీణంలోని వాకలపూడి, జగ్గంపేట, రావులపాలెం, గోకవరం, అమలాపురం, రాయవరం, మలికిపురం, సీతానగరం, రాజోలు, కోరుకొండ, ఉప్పాడ, ముమ్మిడివరం, గొల్లప్రోలు తదితర చోట్ల సినిమా హాళ్లను యజమానులు మూసేస్తున్నారు.
పండగల వేళ ధరల తగ్గింపు పిడుగు
సినీ పరిశ్రమకు పండుగలు చాలా కీలకం. కొవిడ్ కారణంగా గతేడాది మార్చి/ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఆగస్టు/సెప్టెంబరు వరకు మూతపడిన థియేటర్లకు ఇటీవల అఖండ, పుష్ప చిత్రాలు ఊపిరులు ఊదాయి. అయితే ప్రభుత్వ తాజా జీవో 35 ప్రకారం... గ్రామీణ ప్రాంతాల్లోని ఏసీ థియేటర్లలో టికెట్ల ధరలు రూ.10, రూ.15, రూ.20... నాన్ ఏసీ థియేటర్లలో రూ 5, రూ.10, రూ.15... మున్సిపాలిటీల్లో రూ.30, రూ.50, రూ.70, కార్పొరేషన్ పరిధిలోని థియేటర్‌లలో రూ.40, రూ.60, రూ.100లకు విక్రయించాలి.
ఒక్కో థియేటర్ సామర్థ్యాన్ని అనుసరించి నిర్వహణ ఖర్చుల కింద నెలకు కనీసం రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వ్యయమవుతోంది. ఒక్కో థియేటర్‌ను నమ్ముకుని ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 మంది వరకు ఉపాధి పొందుతున్నారు. ఈ పరిస్థితుల్లో తగ్గించిన ధరలతో వచ్చే ఆదాయం... నిర్వహణ ఖర్చులకు కూడా సరిపోదని యజమానులు పేర్కొంటున్నారు. కొవిడ్ కారణంగా ప్రభుత్వం ఇచ్చిన మూడు నెలల విద్యుత్తు బిల్లుల మాఫీ హామీ సైతం అమలుకు నోచుకోలేదని గుర్తుచేస్తున్నారు.
ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలోని నాగేశ్వర థియేటర్ యజమాని తులా నరసింహారావు మాట్లాడుతూ... ‘‘రెండేళ్లుగా సినిమా హాళ్లు నడవడం లేదు. ప్రభుత్వ తాజా నిబంధనలు ప్రకారం సినిమా హాళ్లు నడపాలంటే కరెంటు ఖర్చులు కూడా రావు. ఓటీటీ, ఇతర మాధ్యమాల ప్రభావం మా హాళ్లపై పడింది. టికెట్ ధరల తగ్గింపు కారణంగా థియేటర్లను స్వచ్ఛందంగా మూసేయక తప్పడం లేదు. గతంలో పల్లెలకు, పట్టణాలకు పన్నులో తేడా ఉండేది. ఇప్పుడు అన్నిచోట్ల ఒకే పన్ను విధిస్తున్నారు’’ అని వాపోయారు.
ఇదీ చదవండి: KTR about Textiles GST : జీఎస్టీ పెంపు వస్త్ర పరిశ్రమకు మరణశాసనమే: కేటీఆర్