రాష్ట్రం సాధించిన అద్భుతమైన విజయాల్లో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అజయ్ మిశ్రా సహకారం ఎంతో ఉందని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు తెలిపారు. ప్రభుత్వానికి, విద్యుత్ సమస్యలకు మధ్య వారధిగా ఉండి ఎంతో సహనం, సమన్వయం, సమయ స్ఫూర్తితో బాధ్యతలు నెరవేర్చారని అభినందించారు. పదవీ విరమణ చేసిన అజయ్ మిశ్రాకు ట్రాన్స్కో, జెన్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో విద్యుత్ సౌధలో ఘనంగా వీడ్కోలు పలికారు.
మూడు దశాబ్దాలకు పైగా సాగిన తన కెరీర్లో చివరి మూడేళ్ల పాటు ఇంధన శాఖ కార్యదర్శిగా పని చేయడం గొప్ప అవకాశమని అజయ్ మిశ్రా తెలిపారు. తన కెరీర్ అంత ఎంతో సంతృప్తిగా, సంతోషంగా సాగిందన్నారు. ఉద్యోగ జీవితంలో 25 శాఖలు నిర్వహించానని... అన్నింట్లో ఎక్కువ కాలం పనిచేసి సంతృప్తి కలిగించింది విద్యుత్ శాఖే అని పేర్కొన్నారు. ప్రభాకర్ రావు నుంచి మొదలుకొని విద్యుత్ సంస్థల బాధ్యులంతా ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అజయ్ మిశ్రా అభినందించారు.