ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ గ్రామానికి చెందిన.. ఆ రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్ తోటకూర మారమ్మ ఇల్లు తుపాను కారణంగా సముద్రగర్భంలో కలిసిపోయింది. నిలవడానికి నీడ లేక దిక్కుతోచని స్థితిలో మారమ్మ ఉంది. మారమ్మ దీనస్థితిని గుర్తించిన 'ఈటీవీ భారత్'.. ఆమె ఆవేదనను వెలుగులోకి తెచ్చింది. 'రాష్ట్రస్థాయి పదవి ఉన్నా.. నిలువ నీడ లేదు..!' శీర్షికన కథనాన్ని ఇచ్చింది.
'ఈటీవీ భారత్' కథనంపై జిల్లా పాలనాధికారి మురళీధర్ రెడ్డి స్పందించారు. మారమ్మ సమస్యపై దృష్టి సారించాలని స్థానిక తహసీల్దార్ శివకుమార్‌ను ఆదేశించారు. అధికారులు, నాయకులు ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇప్పటికే మారమ్మకు ఇంటి స్థలం మంజూరు చేశామని.. త్వరలోనే పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. పార్టీ పరంగా మారమ్మను అన్నివిధాలుగా ఆదుకుంటామని నేతలు భరోసా ఇచ్చారు.
ఇదీ చూడండి: ఓటరు, పోలింగ్ స్టేషన్ల వివరాల కోసం ప్రత్యేక యాప్