ప్రజా సంఘాల ప్రతినిధులు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారని రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. అక్రమంగా నిర్బంధించారని దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ ముగించింది.
ప్రజా సంఘాల ప్రతినిధులు ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నారని.. అక్రమ నిర్బంధంలో కాదని హైకోర్టు స్పష్టం చేసింది. చైతన్య మహిళ సంఘం సంయుక్త కార్యదర్శులు దేవేంద్ర, స్వప్న, తెలంగాణ విద్యార్థి వేదిక ప్రధాన కార్యదర్శి సందీప్‌లను అక్రమంగా నిర్బంధించారని దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి.
ముగ్గురి వాంగ్మూలాలు నమోదు
దేవేంద్ర, స్వప్న, సందీప్‌ను పోలీసులు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. ధర్మాసనం ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వరరెడ్డి ముగ్గురి వాంగ్మూలాలను నమోదు చేశారు. తమకు మావోయిస్టులతో ఎలాంటి సంబంధం లేదని.. పోలీసులు తప్పుడు ఆరోపణలతో వేధించి అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.
నిర్బంధించలేదు.. అరెస్టు చేశాం..
తాము ప్రజా సంఘాల ప్రతినిధులను అక్రమంగా నిర్బంధించలేదని.. అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించామని అడ్వొకేట్ జనరల్ తెలిపారు. మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకే జ్యుడిషియల్ కస్టడీకి తరలించినందున.. అక్రమ నిర్బంధం కాదని.. ధర్మాసనం విచారణ ముగించింది.